
నాసిరకం మొక్కలపంపిణీపై ఆందోళన
● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ముంచంగిపుట్టు: ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఉపాధి హామీ డ్వామా పీడీ, అధికారులు నాసిరకం మొక్కలు సరఫరా చేస్తున్నారని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం.శ్రీను, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఆరోపించారు. మండలంలోని ధారెల పంచాయతీ డీంగూడ గ్రామంలో ఆదివాసీ రైతులకు ఉపాధి హామీ పథకంలో అందిస్తున్న మొక్కలను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వామా అధికారులు, మొక్కల ప్లాంటేషన్ యాజమాన్యం కుమ్మకై ్క నాసిరకం మొక్కలు రైతులకు అందించడం దారుణం అన్నారు. కాసు లకు కక్కుర్తిపడి రైతులకు ఉపయోగం లేని మొక్కలు అందిస్తున్నారని, రెండు మూడు అంగుళాల పొడవు ఉన్న మొక్కలను కింద స్థాయి ఉద్యోగులు రైతులకు ఇస్తున్నారని విమర్శించారు. సీజన్ ముగిసిపోతున్న సమయంలో మొక్కలు సరఫరా చేయడం వల్ల అవి బతికే పరిస్థితి లేదన్నారు. గిరిజన రైతులకు ఎలాంటి మొక్కలు అందించిన అడిగే వారు ఉండరని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నాసిరకం మొక్కలు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతులతో ఆందోళనఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.