
దారెల పంచాయతీ అభివృద్ధికి రూ.35 లక్షలు
ముంచంగిపుట్టు: మండలంలోని దారెల పంచాయతీ అభివృద్ధికి జెడ్పీ నుంచి రూ.35లక్షలు కేటాయిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని దారెల పంచాయతీ కేంద్రంలో శుక్రవారం ఆమె రూ.10 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాని, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు,తాగునీరు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దారెల పంచాయతీలోని గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.35లక్షలు జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాండు,వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు,నేతలు జగబంధు, మూర్తి, ఎంపీటీసీలు,సర్పంచులు,నేతలు పాల్గొన్నారు.