గండం గట్టెక్కినా.. వెన్నంటే వెతలు | - | Sakshi
Sakshi News home page

గండం గట్టెక్కినా.. వెన్నంటే వెతలు

Sep 6 2025 5:15 AM | Updated on Sep 6 2025 5:15 AM

గండం గట్టెక్కినా.. వెన్నంటే వెతలు

గండం గట్టెక్కినా.. వెన్నంటే వెతలు

● గోదావరి, శబరి నదులు శాంతించినా తప్పని ఇబ్బందులు ● విలీన మండలాల్లో 20 రోజులుగా రహదారులను వీడని నీళ్లు ● ఎగపోటుతో పొంగిన వాగులు ● మెరుగుపడని దారులు

గోదావరి, శబరి నదులు శాంతించినా విలీన మండలాల ప్రజలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎగపోటుకు గురైన వాగుల నీరు రహదారులను వీడటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు నరకం చూస్తున్నారు.

చింతూరు: గోదావరి, శబరి నదులు శాంతించినా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. చింతూరు మండలంలో శబరినది తగ్గతున్నా వాగుల నీరు ఇంకా రహదారులను వీడలేదు. దీంతో గత 20 రోజులుగా నదీ పరివాహక గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తమ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండలకేంద్రంతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ పడవలపై వరదనీటిని దాటి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వరదనీరు రహదారుల పైనుంచి ఎప్పుడు తొలగుతుందో.. తమకు ఈ ఇబ్బందులు తప్పుతాయోనని వారు ఎదురుచూస్తున్నారు.

● చింతూరు మండలంలో జాతీయ రహదారి–326పై కుయిగూరు వాగుకు వరద తగ్గడంతో ఒడిశాకు రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద ఇంకా రహదారిపై నిలిచిఉండటంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్యతోపాటు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది

తప్పని కష్టాలు

చింతూరు డివిజన్లో అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఆరు ఎఫ్‌ఎస్‌వో, 47 ఎఫ్‌బీవో పోస్టులకు సంబంధించి ఆదివారం కాకినాడలో పరీక్షలు జరగునున్నాయి. పోస్టుల కోసం నాలుగు మండలాల్లో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో వరద అడ్డుగా ఉండటంతో కాకినాడకు వెళ్లేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. తమ గ్రామాల నుంచి శనివారం బయలుదేరితే వరదల కారణంగా పరీక్షకు చేరుకుంటామో, లేదోననే ఆందోళనతో అభ్యర్థులు శుక్రవారం పడవల ద్వారా వరదనీటిని దాటి కాకినాడ వెళ్లారు. కాగా కొంతమంది మహిళలు చంటిబిడ్డలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వాహనాలు, పడవల ద్వారా వరదనీటిని దాటుతున్న దృశ్యాలు కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement