
నూతన విద్యావిధానంతోనే వికసిత భారత్
మద్దిలపాలెం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణాంధ్ర, వికసిత భారత్–2047 కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్’అనే అంశంపై సైన్స్ కాంక్లేవ్‌ను ఘనంగా నిర్వహించింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి, ఏయూ పూర్వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రసంగించారు. వికసిత భారత్–2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సవాలని, దానిపై పూర్తి అవగాహన లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా, బృంద చర్చల ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే విపత్తుల గురించి వివరించారు. టెక్నాలజీని ఉపయోగించి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్‌తో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్లు డాక్టర్ ప్రకాశ్ చౌహన్, డాక్టర్.వి.ఎం.చౌదరి, ఏపీటీసీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ మోహన్‌రావు, ఐఐటీ హైదరాబాద్ పూర్వ సంచాలకుడు ఆచార్య జి.నరహరిశాస్త్ర, రెక్టార్ ఆచార్య కిశోర్‌బాబు, రిజిస్ట్రార్ కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు, డీన్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఏయూలో ఘనంగా సైన్స్ కాంక్లేవ్