
కన్నీటి ఘోష
తేరుకోని విలీన మండలాలు రోజులు గడుస్తున్నా ముంపులోనే రహదారులు 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు స్తంభించిన రవాణా వ్యవసాయ పనులు సాగక ఇబ్బందులు
వరద పోటెత్తి.. వాగులు ముంచెత్తి..
వీఆర్‌పురం మండలం వడ్డిగూడెం వద్ద వరదనీటిలోరాకపోకలు సాగిస్తున్న గ్రామస్తులు
చింతూరు మండలంలో జాతీయ రహదారిపై చేరిన వరద నీటిలోంచి
ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు
చింతూరు: ఎగువన గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గురువారం తెల్లవారుజామున 44 అడుగులకు చేరుకున్న నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ 43 అడుగుల దిగువకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలంలో గోదావరి తగ్గుముఖం పట్టినా ఎగపోటుకు గురై పెరిగిన శబరి నది గురువారం సాయంత్రం నుంచి నిలకడగా మారింది. చింతూరు వద్ద శబరినది నీటిమట్టం గురువారం రాత్రికి 31 అడుగులకు చేరింది.
● గోదావరి, శబరి వరదలు కారణంగా ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గురువారం నాటికి రహదారులు ముంపులోనే ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● ఆగస్టు నుంచి ఇప్పటివరకు మూడు పర్యాయాలు వరద రావడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు నలువైపులా వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇక్కట్లకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే వాహనాల ద్వారా వరదనీరు నిలిచిఉన్న ప్రాంతాలకు చేరుకుని అక్కడినుంచి పడవల మీదుగా వెళ్తున్నారు.
వ్యాపారంపై ప్రభావం
గోదావరి, శబరి వరదలు వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో దాని ప్రభావం వ్యాపార రంగంపై చూపుతోంది. కొనుగోలు దారులు రాక దుకాణాలు వెలవెలబోతున్నాయి. వీఆర్‌పురం మండలంలో అడవివెంకన్నగూడెం, రామవరం, చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, దేవిగూడెం, ఇప్పూరు, పోచవరం, శ్రీరామగిరి, సీతంపేట, వడ్డిగూడెం గ్రామాల వద్ద రహదారిపై వరదనీరు చేరడంతో 30 గ్రామాల ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు.
● శబరినది నిలకడగా ఉన్నా వాగుల నీరు ఇప్పటికీ రహదారులపైనే ఉంది. కుయిగూరువాగుకు స్వల్పంగా పెరిగింది. అంతర్రాష్‌ట్ర రహదారిపై నిలిచిపోయిన వదర నీటిలోంచి ఒడిశాకు వాహనాలు వెళ్తున్నాయి.
● సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద ఇంకా రహదారులపై అలాగే నిలిచి ఉంది. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య, చింతూరు మండలంలో 11 గ్రామాల్లో ప్రజలు గడపదాటని పరిస్థితి నెలకొంది.
ఎటపాక: మండలంలో గురువారం ఉదయం వరకు పెరిగిన గోదావరి వరద మధ్యాహ్నం నుంచి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వరదనీరు నందిగామ, తోటపల్లి, మురుమూరు వాగుల్లో పూర్తిగా తగ్గక పోవడంతో వ్యవసాయ పనులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మిరప మొక్కలు వేసేందుకు కూలీలు వరదనీటిని దాటి పనులకు వెళ్లాల్సివస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడంతో పాటు తిరిగి వరద వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న రైతుల్లో వ్యవసాయ పనులు సాగుతాయా లేదా అనే సందేహం నెలకొంది.
కూనవరంలో పెరుగుతున్న గోదావరి
కూనవరం: భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం తగ్గుతున్నా కూనవరం మండలంలో మాత్రం గురువారం సాయంత్రం వరకు నెమ్మదిగా పెరగడం కనిపించింది. పోలిపాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో కూనవరం నుంచి భద్రాచలంకు రాకపోకలు నిలిచిపోయాయి.
● కొండ్రాజుపేట కాజ్‌వేపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతోపాటు వెంకన్నగూడెం వద్ద రహదారిపై చేరడంతో 8 గ్రామాల ప్రజలు రాకపోకలు సమస్య ఎదుర్కొంటున్నారు. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం రాత్రికి 42 అడుగులకు చేరుకుంది.

కన్నీటి ఘోష

కన్నీటి ఘోష

కన్నీటి ఘోష

కన్నీటి ఘోష