
గోదావరి గుబులు
● క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం
● భద్రాచలం వద్ద 37.60 అడుగులు
● 6.61 లక్షల క్యూసెక్కులు
దిగువకు విడుదల
● ఉదయానికి మరింత పెరిగే అవకాశం
● కేంద్ర జలసంఘం హెచ్చరిక
● విలీన మండలాల్లో ఆందోళన
ఎటపాక: గోదావరికి వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి శుక్రవారం సాయంత్రం 7గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 37.60 అడుగులకు చేరుకుంది. దీంతో 6.61లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు ఎగువన ఉన్న మేడిగడ్డ ,ఇతర ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి మరింత వరద చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. శనివారం ఉదయానికి 40 అడుగులు దాటవచ్చని వెల్లడించారు. వరద ఉధృతి ఇదేవిధంగా కొనసాగితే మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగువ అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు పోటెత్తడంతో పొలాల్లోకి నీరు చేరింది. భద్రాచలంలో 43 అడుగులకు చేరుకోగానే మొదటి, 48 అడుగులకు చేరితే రెండవ, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. కొండ్రాజుపేట సప్టాపైకి వరద నీరు చేరడంతో టేకులబోరు, కోడ్రాజుపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక తహసీల్దార్ కె.శ్రీనివాసరావు ఎంపీడీవో జగన్నాథరావు, ఎస్సై లతశ్రీ కోడ్రాజుపేట చప్టా వద్ద వరద ప్రవాహన్ని పరిశీలించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తహసీల్దార్ కె. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అధైర్య పడవద్దని సూచించారు. కూనవరం బ్రిడ్జి వద్ద శబరి, గోదావరి నదులు ఉధృతికి తగ్గట్టుగా లాంచీలను సిద్ధం చేయాలని వాటి యజమానులను అప్రమత్తం చేశామన్నారు. కాగా కూనవరం వద్ద సాయంత్రం 6గంటలకు 13.60 మీటర్ల (26.5 అడుగులు)కు నీటిమట్టం చేరిందని అధికారవర్గాలు తెలిపాయి.
వరదపై చింతూరు ఐటీడీఏ పీవో సమీక్ష
చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో పీవో అపూర్వభరత్ శుక్రవారం వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమతెరలు పంపిణీ చేయాలని, ఇళ్లను ఖాళీచేసిన బాధితులకు టార్పాలిన్లు ఇవ్వాలని ఆదేశించారు. కూనవరం మండలం బోదునూరు నుంచి ఏడుగురాళ్లపల్లి వరకు నిర్మాణంలో ఉన్న రహదారికి అటవీ అనుమతులు వచ్చినందున యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నాలుగు మండలాల్లో అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వైద్యసిబ్బందికి మూడు నాటు పడవలను ఏర్పాటు చేయడం జరిగిందని, నాలుగు మండలాల్లో ఇప్పటివరకు 440 మంది గర్భిణులను గుర్తించినట్టు తెలిపారు. వరద అధికమైతే వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో జనరేటర్ ఏర్పాటు చేయాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని పీవో సూచించారు. వరదల సమయంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు అంబేద్కర్, బాలకృష్ణారెడ్డి, ట్రైబల్‌వెల్ఫేర్ ఈఈ మురళి, ఏవో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
40 అడుగులకు పెరిగే అవకాశం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద గోదావరి 40 అడుగుల వరకు పెరిగే అవకాశాలున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారని పీవో అపూర్వభరత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టవచ్చని, ప్రస్తుతం చింతూరు డివిజన్లో కొండ్రాజుపేట, టేకులబోరు నడుమ రహదారిపైకి వరదనీరు చేరిందని, మిగిలిన గ్రామాలకు యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయని పీవో తెలిపారు.

గోదావరి గుబులు

గోదావరి గుబులు