
సీఎస్‌పీల్లో అక్రమ వసూళ్లపై ఫిర్యాదు
ముంచంగిపుట్టు: ప్రైవేట్ వ్యక్తులు కొనసాగిస్తున్న కస్టమర్ సర్వీసు పాయింట్ వద్ద వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు గిరిజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీను, నేతలు నరసింగరావు పడాల్, గాసిరందొర, నారాయణలు అన్నారు. మండలంలో ఉన్న చాలా సీఎస్‌పీ కేంద్రాల వ్యక్తులు పేమెంట్లులో కోత, విత్‌డ్రాల్లో మోసాలపై బుధవారం గిరిజన సంఘం మండల నేతలు ఎస్‌బీఐ, ఏపీజీవీబీ బీఎంలు కె.శ్రీనివాస్, పి.సురేష్‌కుమార్‌లను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎస్‌పీల వద్ద జరుగుతున్న మోసాలను వివరించి, అరికట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ సీఎస్‌పీ కేంద్రాలు అక్రమ వసూలు, మోసాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. పలు పథకాల సొమ్ములు ఖాతాల్లో జమ అయ్యాయని, వాటిని తీసుకునేందుకు సీఎస్‌పీ కేంద్రాలకు వెళ్తున్న వినియోగదారులు మోసాలకు గురవుతున్నారన్నారు. వెయ్యి రూపాయలు విత్‌డ్రా చేస్తే 10 నుంచి 30 వరకు కోతవిధిస్తూ అక్రమ వసూలు చేస్తున్నారన్నారు. ఎన్ని వేలు తీసుకుంటే అన్ని వేలకు రూ.30 చొప్పున ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పాటు మారుమూల గిరిజనులు డిజిటల్ పేమెంట్‌ల మీద అవగాహన లేని వారికి ఖాతాల్లో భారీగా మోసాలు చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే సీఎస్‌పీ కేంద్రాల వద్ద ఇలాంటి మోసాలు, అక్రమ వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డియాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ దినేష్‌కుమార్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్టు నేతలు తెలిపారు. దీనికి స్పందించిన బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ సీఎస్‌సీ కేంద్రాల వద్ద పేమెంట్‌లకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, మోసాలు బారిన పడే కస్టమర్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.