
ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా బందోబస్తు
ఎటపాక: పురుషోత్తపట్నం వెళ్తున్నామన్న ముందస్తు సమాచారం భద్రాద్రి దేవస్థానం అధికారులు తమకు ఇవ్వలేదని చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పురుషోత్తపట్నంలో మంగళవారం జరిగిన ఘటనపై స్పందించారు. దేవస్థానం భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇటువంటి ఘటనలు జరగడం సరైందికాదన్నారు.దేవస్థానం ఈవో రమాదేవి తన సిబ్బందితో పురుషోత్తపట్నం వెళ్లిన సమయంలో ఆంధ్రా, తెలంగాణ పోలీసులకు తెలియపర్చలేదన్నారు. గతంలో కూడా అనేక మార్లు పురుషోత్తపట్నం భూముల విషయంలో ఘర్షణలు జరిగాయని, తమకు సమాచారం ఇస్తే తప్పకుండా బందోబస్తుగా వెళ్లేవాళ్లమన్నారు. మంగళవారం జరిగిన ఘటనపై తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఏఎస్పీలతో మాట్లాడినట్టు చెప్పారు. ఎండోమెంట్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ తెలిపారు. దేవస్థానం భూముల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఆంధ్రా పరిధిలోకి వచ్చేటప్పుడు ఇక్కడి పోలీసుల కు ముందస్తు సమాచారం ఇస్తే శాంతి భద్రతల సమస్య లేకుండా చూస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు.
చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా