
ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు తప్పనిసరి
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ
పాడేరు : ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని ఐటీడీఎ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో తన చాంబర్‌లో గ్రామ సచివాలయం, ఐసీడీఎస్, పీఎంయూ అధికారులతో చిన్నారులకు ఆధార్ నమోదు, జనన ధ్రువీకరణ పత్రాల జారీపై సమావేశం నిర్వహించారు.ణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 4765 మంది పిల్లలకు ఆధార్‌కార్డులు, 3484 మంది చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు నేటికీ లేదన్నారు. ఈ నెలఖరులోగా ఆధార్ లేని చిన్నారులందరికీ ఆధార్ నమోదు పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శులు, వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్లు సమన్వయంతో జనన ధ్రువీకరణ పత్రాల జారీ పూర్తి చేయాలన్నారు. ఆధార్ నమోదుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నగదు వసూలు చేయాలని, అదనంగా ఎక్కడైనా వసూలు చేసినట్లు తమకు సమాచారం అందించే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గ్రామ సచివాలయల నోడల్ అధికారి కుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా సమన్వయకర్త సునీల్, జి.మాడుగుల ఐసీడీఎస్ సీడీపీవో మణి, పీఎంయూ అధికారి రాజేష్, ఆధార్ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు.