
నవజాత శిశువులకు వెంటనే జనన ధ్రువపత్రాలు
● డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు
డుంబ్రిగుడ: పీహెచ్‌సీల్లో జరిగే ప్రసవాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి, వెంటనే నవజాత శిశువులకు జనన ధ్రువపత్రాలు అందజేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది రోజువారి హాజరును, మందుల గదిని పరిశీలించారు. మలేరియా కేసులు, ప్రసవాల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి పీహెచ్‌సీ, ఆశా, ఏఎన్‌ఎం ఆరోగ్య సహాయకుల వద్ద మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మాతా శిశు మరణాలు సంభవిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రసవాల అనంతరం జనన ధ్రువపత్రంతోపాటు బేబీ కిట్లు అందజేయాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్‌ఎం, హెచ్‌వీలు కచ్చితంగా అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.