
చింతూరు పీవో ఆదేశాలు బేఖాతర్
ఎటపాక: మాగ్రామానికి వచ్చి వారంలో సమస్యలు పరిష్కరిస్తామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ హామీ ఇచ్చి ఐదు వారాలు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండలంలోని జగ్గవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేసినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత మార్చి 29న చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ తమ గ్రామాన్ని సందర్శించారని తెలిపారు. తమకు తాగునీరు, రహదారి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన విన్నవించామన్నారు. దీనిపై స్పందించిన పీవో అక్కడే ఉన్న అధికారులను పిలిచి వారం రోజుల్లో కొన్ని సమస్యలునైనా పరిష్కరించాలని ఆదేశించారన్నారు. అయితే ఐదు వారాలు గడిచినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పీవోను కలిసేందుకు ఐటీడీఏకు వెళ్లామన్నారు. ఆయన లేకపోవడంతో పీవోకు ఫోన్‌లో పరిస్థితిని వివరించి, గ్రీవెన్స్‌లో మళ్లీ వినతిపత్రం అందజేశామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు ఐవి, రవి, దేవా, శ్రీను పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించని అధికారులు
జగ్గవరం గ్రామస్తుల ఆవేదన
చింతూరు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో
వినతిపత్రం అందజేత