
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని వినతి
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రంపచోడవరంలో గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్ ఉపాధ్యాయ పోస్టులను స్పెషల్ డీఎస్సీ నిర్వహించి, గిరిజన అభ్యర్థులచే నియామకాలు చేపట్టాలని కోరారు. 2001లో నియమితులైన ఆన్‌ట్రైన్‌డ్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎం, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన విద్యాలయాల్లో విద్యుత్, నీటి సమస్యల దృష్యా ఒక ప్లంబర్, ఎలక్ట్రిషియన్‌ను నియమించాలని వినతిలో కోరారు. ఎంపీఆర్‌సీలో ఉన్న ఇతర శాఖ కార్యాలయాలను ఖాళీ చేయించి ఉపాధ్యాయ శిక్షణ, విద్యా విషయాల మానటరింగ్‌కు వినియోగించాలన్నారు. నేతలు ఆదిరెడ్డి, సూరిబాబు, సనాతనబాబు, వెంగళరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.