మహారాణిపేట: క్యాన్సర్‌పై పోరాటాన్ని వేగవంతం చేసి.. అంతర్జాతీయ సహకారం, పరిశోధన, పురోగతికి బలమైన వేదికగా నిలబడాలని ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బెల్లాల రవిశంకర్ ఆకాంక్షించారు. శనివారం విశాఖలోని ఓ హోటల్‌లో ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ కాన్ఫరెన్స్–2025ను ఆయన జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ అనేది క్యాన్సర్ బయాలజీని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కొత్త క్యాన్సర్ చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సంస్థ పరిశోధకులు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య సహకారాన్ని అందిస్తుందన్నారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ క్యాన్సర్ పరిశోధన, చికిత్సా విధానాల్లో నూతన ఆవిష్కరణలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిల్పా, డాక్టర్ ఎన్.రామకోటీశ్వరరావు, డాక్టర్ బి.వి.మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మాలిక్యులర్ అంకాలజీ నిపుణులు, వైద్యులు, పరిశోధకులు పాల్గొంటున్నారు. ‘ప్రెసిషన్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు‘ అనే ప్రధాన థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.