డీసీకి కలిసొచ్చేనా.? | - | Sakshi
Sakshi News home page

డీసీకి కలిసొచ్చేనా.?

Mar 23 2025 8:50 AM | Updated on Mar 23 2025 8:48 AM

● భారత్‌ జట్టుకు కలిసొచ్చిన వైఎస్సార్‌ స్టేడియం ● ఐపీఎల్‌లో చతికిలపడుతున్న ఆతిథ్య జట్లు ● రేపు ఎల్‌ఎస్‌జీ, డీసీ తొలి మ్యాచ్‌

విశాఖ స్పోర్ట్స్‌: పీఎంపాలెంలోని వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం భారత్‌కు అచ్చివచ్చిన వేదికగా పేరుగాంచింది. 2009 తర్వాత వైఎస్సార్‌ స్టేడియంగా మారిన ఇక్కడ భారత్‌ అనేక అంతర్జాతీయ విజయాలు సాధించింది. 2016లో అయితే మూడు ఫార్మాట్లలోనూ(టెస్ట్‌, వన్డే, టీ20) ప్రత్యర్థులను 3–0తో ఓడించి రికార్డు సృష్టించింది. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) విషయానికి వస్తే ఈ స్టేడియం ఆతిథ్య జట్టుకు అంతగా కలిసిరావడం లేదు. ఇక్కడ జరిగిన పది ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో ఆహ్వాన జట్లే విజయం సాధించాయి. న్యూట్రల్‌ గ్రౌండ్‌గా ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరిగాయి. రాష్ట్రానికి సొంత ఫ్రాంచైజీ లేకపోయినా.. ఈ స్టేడియం పలు జట్లకు హోం గ్రౌండ్‌గా వ్యవహరిస్తోంది. 2012లో తొలిసారిగా డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు హోం గ్రౌండ్‌గా మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో చైన్నె సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. 2015లో డెక్కన్‌ చార్జర్స్‌ పేరు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా మారి ఇక్కడ మ్యాచ్‌ ఆడింది. ఈసారి రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో పరాజయం పాలైంది. 2016లో ముంబై ఇండియన్స్‌, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఇక్కడ మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. 2019లో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) ఈ స్టేడియాన్ని తమ రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఎంచుకుంది. అయితే ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమిని చవిచూసింది. విశేషం ఏమిటంటే ఇక్కడ విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచింది. డీసీ ప్రస్తుత సీజన్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లను ఇక్కడే ఆడనుంది. డీసీకి ఈ స్టేడియం హోమ్‌ గ్రౌండ్‌ కంటే ఆహ్వాన జట్టుగానే కలిసి వచ్చింది. గతంలో ఆహ్వాన జట్టుగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌పై విజయాలు సాధించింది. 2019లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఓడించి క్వాలిఫైయిర్‌ ఆడింది. ఈ సీజన్‌లో డీసీ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయగా సోమవారం రాత్రి 7.30 గంటలకు సీజన్‌ తొలి బంతిని ఎదుర్కోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement