డుంబ్రిగుడ: మండలంలోని కితలంగి పంచాయతీ మారుమూల గ్రామమైన గాంధలో తాగునీటి సౌకర్యం కల్పించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం గాంధ గ్రామంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 70 కుటుంబాలు ఉండగా, 350 మంది జనాభాకు మంచినీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. తాగునీరు కల్పించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని తాగునీరు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేవారు. ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.బి పోతురాజు, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
చింతపల్లి: స్థానిక సాయినగర్‌లో తాగునీటి సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో సాయినగర్ వాసులు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ గడిచిన కొన్ని రోజులుగా సాయినగర్‌లో మంచినీరు అందుబాటులో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం కల్పించకుంటే నిరసన కొనసాగిస్తామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాసరావు,మంచినీటి విభాగం ఇంజినీరు స్వర్ణలత మాట్లాడుతూ సాయినగర్ వీధిలో వారం రోజుల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని తెలిపారు. ముందుగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్బులు బోనంగి చిన్నయ్యపడాల్,గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవిపడాల్ తదితరులు పాల్గొన్నారు.