సాక్షి,పాడేరు: జిల్లాలో 281 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వారంలో రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, ప్రజలకు చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో నీటి పథకాల ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ జరపాలన్నారు.జిల్లాలోని 34 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని,రెవెన్యూ అధికారులు భూబదలాయింపు ప్రక్రియ త్వరగా చేపట్టాలని చెప్పారు. ప్రతి రైతుకు యూనిక్ ఐడీ కేటాయింపునకు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు.కాఫీ పంటకు ఈ–క్రాప్‌ను నమోదు చేయాలని,124 హెక్టార్లలో బిందు,తుంపర సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.అరకు మండలంలో విభిన్న ప్రతిభావంతులు 400మంది వరకు ఉన్నారని,జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఉపాధి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ,ఉద్యానవనశాఖ జిల్లా అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్‌కుమార్‌రావు,డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి 508 గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తి చేయాలని చెప్పారు.మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో పాటు వాటిని పరిరక్షించాలని తెలిపారు. పోరంబోకు భూములను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్‌లను ఆదేశించారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్,డీఆర్‌వో పద్మలత,ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం