చురుగ్గా పనులుజరుగుతున్నాయి
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో అదనపు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల హైడల్ డైరెక్టర్ సుజైకుమార్ ఆధ్వర్యంలో స్పెరల్ కేసింగ్ టెస్టింగ్ జరిగింది. సివిల్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఐదు,ఆరు యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి స్పేర్‌పార్టులను బీహెచ్‌ఈఎల్ సమకూరుస్తుంది. – బి. వాసుదేవరావు,
చీఫ్ ఇంజినీర్, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం
●
మోతుగూడెం: జలవిద్యుత్ కేంద్రాలను బలోపేతం చేసి, మరింతగా చౌకగా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో కొత్త యూనిట్ల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో ఎక్కడా కొత్త యూనిట్ల నిర్మాణానికి అవకాశం లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకుని అప్పటి రష్యా ఇంజినీర్లు మరో రెండు యూనిట్ల నిర్మాణానికి వీలుగా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాన్ని 1975 సంవత్సరంలో రష్యా సాంకేతిక సహకారంతో నిర్మించారు. దాదాపు 48 సంవత్సరాల తరువాత ఏపీ జెన్‌కో ఇంజినీర్లు కొత్త యూనిట్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కీలకమైన స్పెరల్ కేసింగ్ పనులు పూర్తి
కొత్తగా చేపట్టిన ఐదు, ఆరు యూనిట్లు పూర్తయిన తరువాత టర్బైన్‌లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే కీలకమైన స్పెరల్ కేసింగ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ పనులు కూడా పూర్తి చేశారు.వాల్వ్ హౌస్ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ వరకు పెన్‌స్టాక్ పైప్ లైను పనులు చురుగ్గా సాగుతున్నాయి. జలవిద్యుత్ కేంద్రంలో ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణం కోసం స్పెరల్ కేసింగ్ పనులు పూర్తి కావడంతో తదుపరి సిమెంట్ పనులు మొదలు పెడతారు. తరువాత టర్బైన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మాచ్‌ఖండ్, అప్పర్ సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రాష్ట్రానికి చౌకగా విద్యుత్ అందుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ ద్వారా 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కొత్తగా నిర్మించే ఐదు, ఆరు యూనిట్ల ద్వారా 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అదనంగా జరగనుంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో 1,2 యూనిట్లు రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణమైతే, 2,3 యూనిట్లు బీహెచ్‌ఈఎల్ సంస్థ సహకారంతో నిర్మించారు. రూ.536 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతున్న యూనిట్ల నిర్మాణం పూర్తయితే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో శరవేగంగా పనులు