
పాడి పశువుకు బీమా ట్యాగ్ వేస్తున్న సిబ్బంది
జిల్లాలో పిడుగుపాటు, భారీ వర్షాలు, ఉరుములు, విద్యుత్ షాక్, వ్యాధుల కారణంగా మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పెంపకందారులకు సరైన అవగాహన లేక బీమా చేయించకపోవడంతో వారు ఆర్థికంగా నష్టపోయారు. డాక్టర్ వైఎస్సార్ పశు బీమా చేయించడం వల్ల ఇలాంటి సందర్భాల్లో అండగా నిలుస్తుంది.
పాడేరు రూరల్ : మూగజీవాలైన గేదెలు, గొర్రెలు, మేకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా సౌకర్యం కల్పిస్తోంది. గతంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ పశు నష్ట పరిహారం పథకం స్థానంలో మార్పులు చేసి కొత్తగా డాక్టర్ వైఎస్సార్ పశు బీమా పథకాన్ని రూపకల్పన చేసింది. ఈ పథకం రైతులకు ఎంతో వరంగా చెప్పొచ్చు. లబ్ధిదారులు తమ వాటా కింద తెల్లరేషన్ కార్డు ఉన్న రైతులు లేదా ఎస్సీ,ఎస్టీ రైతులు కేవలం 20 శాతం, తెల్లరేషన్ కార్డు లేని వారు 50 శాతం ప్రీమియం చెల్లిస్తే ఈ పథకానికి అర్హత పొందవచ్చు.
● ఒకసారి ప్రీమియం చెల్లిస్తే పశువులు, గేదెలకు మూడేళ్లపాటు, మేకలు, పందులకు ఒకటి నుంచి మూడేళ్ల పాటు ఈ భీమా పథకం వర్తిస్తుంది. గతంలో మాదిరి నెలలు, సంవత్సరాల పాటు కాలయాపన చేయకుండా జీవం మృతి చెందిన 21 రోజులకే వాటి పెంపకందారులు, యజమానుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఏదైన సాంకేతిక కారణాలతో బీమా పరిహారం జమ కాకుంటే ఆ విషయాన్ని సంబంధిత వెబ్‌సైట్లో పొందుపరుస్తారు.
పథకం ప్రయోజనమిలా..
● రెండు నుంచి పదేళ్ల వయసు కలిగి ఒక్కసారైనా ప్రసవమైన ఆవులకు, మూడు నుంచి 12 సంవత్సరాల వయసు కలిగి ఒక్కసారైనా ప్రసవమైన గేదెలకు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఐదు పశువులు, ఆరు నెలలు ఆపై వయసు కలిగిన గొర్రెలు, మేకలు, పందులకు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 50 జీవాలకు ఈ పథకం వర్తిస్తుంది.
● దేశవాళి, సంకర జాతి ఆడ, మగ పశువులకు రూ.30వేల వరకు, నాటు జాతికి చెందిన ఆడ,మగ పశువులకు రూ.15వేల వరకు, గొర్రెలు, మేకలు, పందులకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం రాయితీతో బీమా సౌకర్యం కల్పిస్తుంది.
● లబ్ధిదారుడు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తానికి బీమా చేయించుకుంటే ఆపై మొత్తానికి పూర్తి ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే ఆవులకు, గేదెలకు గరిష్టంగా రూ.1.20 లక్షల వరకు, గొర్రెలు, మేకలు, పందులకు గరిష్టంగా రూ.15 వేల వరకు బీమా సౌకర్యం ఉంది.
● బీమా సొమ్ము చెల్లించిన పెంపకందారుడు, యజమాని వాటిని వేరే రైతుకు విక్రయిస్తే ఆ వివరాలను ఏడు రోజుల్లో దగ్గర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలో తెలియజేయాలి. అలా చేస్తే జీవాలను కొనుగోలు చేసిన కొత్త రైతుకు బీమా సౌకర్యం వర్తిస్తుంది.
● బీమా పరిహారం పొందడానికి ట్యాగ్ తప్పనిసరి. పశు బీమా పొందాలంటే రైతులు తమకు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి వారి జీవాల వివరాలతో రైతు వాటా ప్రీమియం సొమ్మును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆ రైతుకు అతని జీవాలకు బీమా సదుపాయం వర్తిస్తుంది.
జీవాల వివరాలు
పశువులు : 6,27,059
గేదెలు : 91,874
గొర్రెలు : 1,93,482
మేకలు : 3,82,596
అవగాహన కల్పిస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డాక్టర్ వైఎస్సార్ పశు భీమా పథకంపై గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. జీవాలకు ఇన్సూరెన్సు తప్పనిసరి. ప్రభుత్వం నిర్ణయించిన బీమా పరిహారం పొందాలంటే ట్యాగ్ తప్పనిసరి. మూగజీవాలు మృతిచెందిన సందర్భంలో వెంటనే పశుసంవర్థకశాఖ అధికారులకు తెలియజేయాలి. 21 రోజుల్లో బీమా పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. – డాక్టర్ జి. వెంకటస్వామి,
జిల్లా పశు సంవరర్థక శాఖ అధికారి, పాడేరు
అందుబాటులో డాక్టర్ వైఎస్సార్
పశు బీమా
రైతులకు వరంలా పథకం
అవగాహన లేక ప్రయోజనం
పొందలేకపోతున్న పెంపకందారులు
బీమా వివరాలు
ఆవు / గేదెలు
బీమా మొత్తం లబ్ధిదారుడి వాటా ఏపీఎల్ కాలపరిమితి
బీపీఎల్/ఎస్సీ/ఎస్టీ
రూ.30వేలు రూ.384 రూ.960 మూడేళ్లు
రూ.15వేలు రూ.192 రూ.480 మూడేళ్లు
గొర్రె/ మేకలు
రూ.6వేలు రూ.36 రూ.90 ఏడాది
రూ.6వేలు రూ.54 రూ.135 రెండేళ్లు
రూ.6వేలు రూ.75 రూ.187.5 మూడేళ్లు
