జన్నారం: తాత అంత్యక్రియలకు వెళ్తూ గుండెపోటుకు గురై మనుమడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన సంకపాగ దేవన్న (35) గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లలో వరుసకు తాత అయిన చిన్నరాజన్న అంత్యక్రియలకు బస్సులో బయలుదేరాడు. కడెం మండలం ఉడుంపూర్ సమీపంలోకి వెళ్లే సరికి చాతిలో నొప్పి రావడంతో జన్నారం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుని సూచన మేరకు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందాడు.
పానీపూరి బండి వద్ద గొడవలో ఒకరిపై దాడి
భైంసాటౌన్: పానీపూరి బండి వద్ద జరిగిన స్వల్ప తగాదా ఒకరిపై దాడికి దారితీసిన ఘటన పట్టణంలోని మున్సిపల్ చౌక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దెగ్లూర్‌కు చెందిన రాహుల్ భైంసాలో కొద్దిరోజులుగా పానిపూరి బండి నిర్వహిస్తున్నాడు. ఓవైసీనగర్‌కు చెందిన షేక్ మస్తాన్ గురువారం బండి వద్దకు వచ్చి పానీపూరి అడిగితే నిర్వాహకుడు లేదని బదులిచ్చాడు. అయినా వినకుండా దుర్భాషలాడడంతో ఆగ్రహించిన రాహుల్ రాడ్‌తో మస్తాన్‌ను గాయపర్చాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయికుమార్ తెలిపారు.
విద్వేషాలు వ్యాప్తి చేస్తే చర్యలు
చిన్నపాటి గొడవలు, తగాదాలతో జరిగే ఘటనలకు విద్వేషాలు రెచ్చగొట్టేలా పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నకిలీ భూదస్త్రాలతో మోసగించిన ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: నకిలీ భూ దస్త్రాలు సృష్టించి కొనుగోలు దారుడిని మోసగించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సీ.హెచ్.హనోక్ తెలిపారు. బెల్లంపల్లి మండలం బుధాకలాన్‌లో రాంపల్లి గణేశ్‌కు చెందిన వ్యవసాయ భూమిని మంచిర్యాలకు చెందిన సంగం సాగర్‌కు లాశెట్టి సతీష్ (బుధాకుర్దు), రామటెంకి హరికృష్ణ, రామటెంకి శివకుమార్ (బట్వాన్‌పల్లి), కామెర రాజు (మంచిర్యాల), కట్టా పవన్ కుమార్ (బెల్లంపల్లి బస్తీ) ముఠాగా ఏర్పడి నకిలీ పట్టేదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు సృష్టించి అమ్మకానికి ఒప్పందం చేసుకున్నారు. సాగర్ వద్ద నుంచి ముఠా సభ్యులు పలు దఫాలుగా రూ.31,80,000 నగదు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం లాశెట్టి సతీష్, కట్టా పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకోగా హరికృష్ణ, శివకుమార్, రాజు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


