కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు వీడనాడాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసం వందేళ్లకు పైగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించి నాలుగు కోడ్‌లుగా తీసుకువచ్చిందన్నారు. దీంతో కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదన్నారు. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇందులో వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


