బుల్డోజర్ పాలనను తిరస్కరించాలి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ఆదరించి బుల్డోజర్ పాలనను తిరస్కరించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జిలకు బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు భూమిపూజ పేరిట నాటకాలు ఆడుతున్నారే తప్పా వారికి దానిపై చిత్తశుద్ధి లేదన్నారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఆదిలాబాద్‌కు మనమే అసలైన ఆదిల్‌గా ఉండాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషంలో చేజారిన తౌఫిక్ అహ్మద్‌తో పాటు పలువురు వివిధ పార్టీల నుంచి ఎంపీ సమక్షంలో ఎంఐఎంలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
11 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
విశ్వ గురువుగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడికి ఎందుకు భయపడుతున్నారని ఒవైసీ ప్రశ్నించారు. రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ట్రంప్ చెప్పడంతో మోదీ అంగీకరించి కొనుగోళ్లను ఆపారన్నారు. బీసీ బిడ్డగా చెప్పుకునే మోదీ బీసీలకు అన్యాయం చేసేలా యూజీసీ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో దేశానికి నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మెహరాజ్ హుస్సేన్, హైదరాబాద్ కార్పొరేటర్ సలీమ్ బేగ్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సయ్యద్ అత్తు తదితరులు పాల్గొన్నారు.
నేడు పట్టణంలో రోడ్‌షో
ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు.
బుల్డోజర్ పాలనను తిరస్కరించాలి


