అమ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా!
ఉట్నూర్ ఆసుపత్రిలో తల్లిని కోల్పోయిన శిశువు
‘అమ్మా.. నీ పొత్తిళ్లలో నవమాసాలు మోశావు.. నాతో పాటే తమ్ముడికీ జన్మనిచ్చావు.. ఇంతలోనే ఎక్కడికి వెళ్లావమ్మా.. తొమ్మిది నెలలు ఒక్క క్షణం కూడా వదిలి ఉండని నువ్వు.. మూడు రోజులైతందమ్మా చూడక.. వాడూ కనబడట్లేదు.. నాకు ఆకలవుతుందమ్మా.. గొంతెండుకు పోతుందమ్మా.. నాన్న కూడా ఎందుకో ఏడుస్తున్నాడు.. త్వరగా వచ్చేయ మ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా..’ అనే ఈ వేదన ఆస్పత్రిలో వెక్కివెక్కి ఏడుస్తున్న మూడు రోజుల ఓ పసికందు ఆక్రందనకు అక్షర రూపం. సోమవారం ప్రసూతి సమయంలో కవలలకు జన్మనిచ్చిన తల్లి.. పురిటిలోనే తనువు చాలించింది. ఓ శిశు వు అమ్మతోనే తానంటూ లోకం వీడగా.. మరో శిశువు బుధవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడ్చిన తీరు అందరి హృదయాలను కలిచివేసింది. తల్లిపాల కోసం గుక్కపట్టిన ఆ చిన్నారిని చూసిన కళ్లన్నీ చెమ్మగిల్లాయి. – ఉట్నూర్‌రూరల్
ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన టెకం జంగుబాయి సోమవారం కవలలకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యసేవలు అందక తనతో పాటు ఓ శిశువు పురిటిలోనే ప్రాణాలు విడిచిన ఘటన విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో శిశువు వద్ద ఆ తండ్రి బుధవారం విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. సిగ్నల్స్ అంది.. అంబులె న్స్ వచ్చి ఉంటే నా కుటుంబం ఆగం అయ్యేది కాదని.. ఈ కష్టం ఎవరికీ రావొద్దంటూ విలపించిన తీరు ఏజెన్సీ ప్రాంతంలో రవాణా, వైద్య పరిస్థితులకు అద్దం పడుతోంది.
కనీస సౌకర్యాలు కరువు..
గ్రామంలో 30 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ ఊరికి కనీసం రోడ్డు లేదు. ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ రావు. ఈ క్రమంలో పురిటి నొప్పులు మొదలైన జంగుబాయిని ఆస్పత్రికి తరలించడం కష్టమైంది. సకా లంలో వైద్యం అందక కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లీ మరో బిడ్డతో కలిసి తనువు చాలించింది. సో మవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆ ఊరి దీన స్థితికి అద్దం పడుతోంది. అయితే ఆ బాధితుడు ఎవరోకాదు..ఆ గ్రామపటేల్ ఆనందర్‌రావు. చని పోయింది ఆయన భార్య జంగుబాయి. కళ్లుతెరవకముందే లోకంవిడిచింది తన మరోకుమారుడు.
ప్రాణాలు పోతున్నా పట్టింపేది?
ఓ వైపు సాంకేతికంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా గిరిజన బతుకులు మాత్రం మారడం లేదు. ఐటీడీఏ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని సర్కారు చెబుతున్నా ఆచరణలో కనిపించని పరిస్థితి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


