‘ఐసీడీఎస్‌ను ప్రైవేట్‌పరం చేసే కుట్ర’
ఆదిలాబాద్‌రూరల్: ఐసీడీఎస్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి ఆరో పించారు. యూనియన్ రాష్ట్ర ఐదో మహాసభ రెండో రోజు కార్యక్రమం మావలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారంనిర్వహించారు. సభకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు హాజరై అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు పౌష్టికాహారం అందించడంలో కీలకంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి రాష్ట్ర మహా సభల్లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రాట్యూటీ ఇవ్వాలని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, అంగన్‌వాడీ ఉద్యోగులను 3వ, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు, శ్రామిక మహిళా కన్వీనర్ రమ, అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, పద్మ, లంకా రాఘవులు, పూసం సచిన్, బండి దత్తాత్రి, ఆశన్న, కిరణ్, దర్శనాల మల్లేష్, శకుంతల, మంజుల, జమున, సంకే రవి, రాజన్న, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.


