వేటు పడిందా.. లేదా?
ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ ప్రవీణ్ సస్పెన్షన్ వ్యవహారంలో.. ఉత్తర్వులే రాలేదని ఆ శాఖలోనే చర్చ! కాపీ ఇవ్వడం కుదరదంటున్న ఇన్‌చార్జి డీఆర్ ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు
సాక్షి, ఆదిలాబాద్: సాధారణంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగి సస్పెన్షన్‌కు గురైతే ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అవుతాయి.. దానికి సంబంధించి ఎలాంటి గోప్యత ఉండదు.. ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖలో వివిధ ఆరోపణలపై ఆదిలాబాద్‌లో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన ప్రవీణ్‌ను సస్పెండ్ చేసినట్లు ఇన్‌చార్జి డీఆర్ ప్రసన్న స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదనేది ఆ శాఖలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. అసలు సస్పెన్షన్ వేటు పడిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ కరీంనగర్ ఇన్‌చార్జి డీఐజీ రమేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్ ప్రసన్నను వివరణ కోరినప్పుడు కాపీ ఇవ్వడం కుదరదని పేర్కొనడం గమనార్హం.
ఆదిలాబాద్ చుట్టుపక్కల వివిధ సర్వేనంబర్లలోని అనధికారిక లేఅవుట్లలో ఇటీవల పెద్ద ఎత్తున వందలాదిగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదట్లో అక్రమ రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగిపోవడంతో మరోసారి వందలాది డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు స్కెచ్ రెడీ చేశారు. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ఆ రోజు నుంచి అసలు కార్యాలయానికే రాలేదు. ఆ తర్వాత అతడిని భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. దీనికి సంబంఽధించి ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న నిజామాబాద్ డీఆర్ ప్రసన్న నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే కేవలం డిప్యూటేషన్‌పై తరలించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారని ‘సాక్షి’లో మరో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఆర్ ప్రసన్న ఆదిలాబాద్‌కు వచ్చి ఈ వ్యవహారంలో విచారణ చేపట్టారు. అదే రోజు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత విచారణ నివేదికను రిజిస్ట్రేషన్ల శాఖ కరీంనగర్ డీఐజీకి నివేదించారు. దీని ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు ‘సాక్షి’ వివరణ కోరినప్పుడు డీఆర్ ప్రసన్న స్పష్టం చేశారు. ఇది నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. అయితే అసలు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ ప్రవీణ్ సస్పెండ్ అయినట్లు ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటి వరకు రాలేదని ఆ శాఖలో తాజాగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయంలో ఉత్తర్వు ప్రతి ఇవ్వాలని ఇన్‌చార్జి డీఆర్ ప్రసన్నను ‘సాక్షి’ కోరగా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
ఎందుకీ దోబూచులాట..
ఓ ఉద్యోగి సస్పెన్షన్ వ్యవహారంలో ఉన్నతాధికారులు గోప్యత పాటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ కాపీ ఇవ్వడం కుదరద ని వారు పేర్కొనడం పలు అనుమానాలకు తా విస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖా పరంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు పెరిగాయి. ఇటీవల మంచిర్యాలలో ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడి చేశారు. ఆ రోజు అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు జరిగా యా.. ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా చేస్తున్నారా అనే అంశాల్లో పరిశీలన చేశారు. అయితే ఆదిలాబా ద్ కార్యాలయంలో ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ జీపీఏ ద్వారా లింక్ సృష్టించి తిరిగి వాటిని సేల్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్లు చేయడం, అవి కూడా ఒకటి, రెండు కాకుండా వందలా ది డాక్యుమెంట్లు అప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిపోవడం, మరిన్ని రిజిస్ట్రేషన్ల కోసం స్కెచ్ వేయ డం వంటివి జరిగాయి. అయితే ఈ వ్యవహారంలో శాఖాపరంగా నామ్‌కే వస్తే విచారణ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్‌ను సస్పెన్షన్ చేశామని నోటిమాటగా చెప్పడం తప్పితే రాత పూర్వకంగా ఆదేశాలు బయటకు రానివ్వకుండా పకడ్బందీగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఆ సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్‌ను ఈ వ్యవహరం నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది డాక్యుమెంట్లు ఒక సబ్ రిజిస్ట్రార్ ఇంతకు తెగించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


