● ఐపీ స్టేడియంలో అరకొర సౌకర్యాలు ● సామర్థ్యం మేర రాణించలేకపోతున్న అథ్లెట్లు ● దృష్టి సారించాలంటున్న క్రీడాకారులు ● సింథటిక్ ట్రాక్ ఏర్పడితే ప్రయోజనం
ఆదిలాబాద్: క్రీడాకారులు రాణించాలంటే అనువైన ఆటస్థలంతో పాటు శిక్షకులు ఎంతో అవసరం. అలాగే ఆయా క్రీడలకు అవసరమై క్రీడా సామగ్రి సైతం అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ వంటి వ్యక్తిగత క్రీడాంశాల్లో వీటి అవసరం మరింత అధికం. అథ్లెటిక్స్‌లో 23 పైగా ఈవెంట్స్ ఉంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా క్రీడా పరికరాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు ఉన్నప్పటికీ వసతులలేమి, శిక్షకుల కొరతతో రాష్ట్ర స్థాయి పోటీలకు మాత్రమే పరిమితమవుతున్న దుస్థితి. క్రీడల్లో రాణించాలని పట్టుదల ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో సరైన సదుపాయాలు ప్రోత్సాహం కరువై నిరుపేద అథ్లెట్లు అర్ధంతరంగా క్రీడలను వదిలేస్తున్నారు.
అధ్వానంగా రన్నింగ్ ట్రాక్..
అథ్లెటిక్స్‌లో రాణించాలంటే ఒక్కో అథ్లెట్ సగటున 10 నుంచి 12 ఏళ్ల వరకు శ్రమిస్తే జాతీయ స్థాయికి ఎదగవచ్చనేది క్రీడా నిపుణుల అభిప్రాయం. అయితే క్రీడాకారులు సన్నద్ధం అవ్వాలంటే రన్నింగ్ ట్రాక్‌తో పాటు ఫిజియోథెరపిస్ట్, జిమ్, ఆయా క్రీడాంశాలకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండాలి. అలాగే ప్రత్యేక కోచ్ పర్యవేక్షణ తప్పనిసరి. అప్పుడే క్రీడాకారులు అత్యున్నతంగా రాణించగలుగుతారు. అయితే జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని(ఐపీ) స్టేడియంలో మొరం ట్రాక్ పైనే సాధన చేయాల్సిన దుస్థితి. దీంతో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నా జాతీయ స్థాయి పోటీల వరకు వెళ్లలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కరువైన సదుపాయాలు..
అథ్లెటిక్స్‌లో రన్నింగ్‌తో పాటు జంప్స్, త్రోస్, కంబైన్డ్ ఈవెంట్స్ వంటి నాలుగు విభాగాలుంటాయి. ఆయా క్రీడల్లో రాణించాలంటే అవసరమైన హార్డిల్స్, హైజంప్, లాంగ్‌జంప్ పిట్ పోల్‌వాల్ట్ బెడ్ల ఏర్పాటు ఎంతో ముఖ్యం. అయితే ఐపీ స్టేడియంలో అరకొర వసతుల నడుమ సాధన చేయాల్సి వస్తుంది. ఇక ఇదే స్టేడియంలోనే ఉన్న క్రీడా పాఠశాల విద్యార్థులకు అథ్లెటిక్స్ విభాగంలో ప్రత్యేకంగా కోచ్ ఉన్నారు. అయితే జిల్లాకు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రం శిక్షకుడు లేకపోవడం గమనార్హం. దీంతో వారే సొంతంగా మైదానంలో సాధన చేసుకోవడం గానీ, ఇతర ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో చేరాల్సిన పరిస్థితి. జిల్లాలోనే విశాలమైన మైదానం ఉన్న స్టేడియంలో అథ్లెటిక్స్ ఆడేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడాభిమానులు, క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.
సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే..
స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటయితే సాధన ఎంతో మెరుగ్గా సాగుతుంది. సాంకేతికతతో కూడిన శిక్షణ అందుతుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించే అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి. ప్రస్తుతం సాధారణ ట్రాక్‌పై సాధన చేస్తున్న క్రీడాకారులు పూర్తిస్థాయిలో తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు.
సాయ్ కేంద్రమూ రావొచ్చు..
క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించవచ్చు. సింథటిక్ ట్రాక్‌తోపాటు అథ్లెటిక్స్ క్రీడలకు సంబంధించి మరిన్ని వసతులు అందుబాటులోకి వస్తే అకాడమీ ఏర్పాటుకు బలం చేకూరుతుంది. ఒకవేళ సాయ్ సెంటర్ మంజూరు అయితే 40 మంది ఆటగాళ్లకు వసతితో కూడిన శిక్షణ అందించవచ్చు.
ఎంతో ఉపయోగకరం..
సింథటిక్ ట్రాక్ ఏర్పడితే అథ్లెట్స్ జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణిస్తారు. శిక్షణ, సాధన చాలా సులువు అవుతుంది. ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే ఎంతో ఉపయోగకరం.
– రాకేశ్, అథ్లెటిక్స్ శిక్షకుడు
అసోసియేషన్ తరఫున కృషి..
సింథటిక్ ట్రాక్ ఏర్పాటు విషయమై అసోసియేషన్ తరఫు నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నాం. జిల్లాలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అయితే ఎన్నో జాతీయస్థాయి పోటీలను నిర్వహించవచ్చు. ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే వీలైనంత త్వరగా ట్రాక్ నిర్మాణం అయ్యే అవకాశం ఉంది.
– రాజేశ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
స్టేడియం సరే.. వసతులేవి?
స్టేడియం సరే.. వసతులేవి?