
ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు
ఇంద్రవెల్లి: ఖరీఫ్‌సీజన్ నేపథ్యంలో ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు విత్తన పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విత్తన పూజలు చేశారు. అమ్మవారికి నవధాన్యాలతో నైవేద్యాలు సమర్పించారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఆలయ మహారాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల ఆదివాసీలు ఉన్నారు.
108లో ప్రసవం
బెల్లంపల్లి: పురిటినొప్పులతో బాధపడుతున్న 8 నెలల గర్భిణికి 108 సిబ్బంది ఎంతో నేర్పుతో ఆదివారం ప్రసవం చేశారు. కుమురం భీం జిల్లాలోని భీమన్‌గూడ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం పోసుబాయికి పురిటినొప్పులు వచ్చాయి. ఆశ కార్యకర్త సహాయంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రికి రెఫర్ చేయడంతో అక్కడికి తీసుకెళ్లారు. 8 నెలల గర్భిణి, రక్తం తక్కువగా ఉండటం, ఐదో కాన్పు కావడంతో అక్కడి వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. వెంటనే పోసుబాయిని మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సోమగూడెం శివారుప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డు పక్కన అంబులెన్స్‌ను నిలిపి ఈఆర్‌సీపీ వైద్యుడి సలహాతో ఈఎంటీ దుర్గం ఆత్మరావు, పైలెట్ అజయ్ ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని మంచిర్యాల మాతా శిశుకేంద్రానికి తరలించారు. బెల్లంపల్లి 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్‌ను కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.

ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు