
● వానాకాలం పంటల కోసం.. ● దుక్కులు సిద్ధం చేస్తున్న రైతు
సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం పంటల సాగుకు జిల్లా రైతాంగం సన్నద్ధమవుతోంది. దుక్కులు దున్ని చేలను చదును చేసే పనుల్లో బిజీగా మా రారు. మరోవైపు భూసారం పెంచేందుకు అందుబాటులో ఉన్నవారు సేంద్రియ ఎరువులతో పాటు చెరువు మట్టిని పొలాల్లో వేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో యాసంగితో పోల్చితే వానాకాలంలోనే పంటల సాగు అధికంగా ఉంటుంది. కేవలం వర్షాధారంగానే 70 శాతం వరకు సాగవుతుంటుంది. దీంతో ఈ సీజన్ వస్తుందంటే జిల్లా రైతులంతా బిజీ అవుతారు. ప్రధానంగా జిల్లాలో పత్తిని ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత సోయా, కందులు, ఇతరత్రా పంటలు సాగు ఉంటుంది. గత వానాకాలంలో 5లక్షల 79వేల 124 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
పెరగనున్న పత్తి విస్తీర్ణం..
జిల్లాలో ఈ ఏడాది కూడా పత్తి, సోయా, కంది పంటలు అధిక విస్తీర్ణంలో సాగు కానున్నాయి. ఇందులో 75 శాతం వరకు పత్తి ఉండనుంది. గతేడాదితో పోల్చితే ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం పెరగనుందని, అలాగే సోయా కొంత తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఏడాది పత్తి విత్తనాలు విరివిగా లభ్యమయ్యే పరిస్థితి ఉండడంతో రైతులు అటువైపే మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రణాళిక సిద్ధం..
వానాకాలం పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సీజన్‌లో ఏయే పంటలు ఎంత సాగవుతాయి.. దానికి అనుగుణంగా విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా.. అనే అంశంలో ఇప్పటికే ఆయా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశాలు పూర్తి చేసింది. ఈ సీజన్‌లో పత్తి విత్తనాల ప్యాకెట్లు అంచనాకు మించి అందజేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి విత్తనాల కొరత ఏర్పడేందుకు ఆస్కారమే లేదని పేర్కొంటున్నారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు యంత్రాంగం పాటుపడుతుంది.
దుక్కిదున్ని చేనును సాగుకు సిద్ధం చేస్తూ..
జిల్లాలో వానాకాలం పంటల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)..
పంట 2024లో 2025లో అవసరమయ్యే
(అంచనా) విత్తనాలు(క్వింటాళ్లలో)
పత్తి 4,36,473 4,40,000 11,00,840 ప్యాకెట్లు
సోయాబీన్ 65,464 62,500 18,725
కంది 57,258 55,000 21,960
జొన్న 1493 1600 66
మొక్కజొన్న 15066 23000 1,834
వరి 2030 1900 489
పెసర 546 550 22
మినుము 561 550 44
ఇతరత్రా 231 250 12
అవసరమయ్యే ఎరువులు
(మెట్రిక్ టన్నుల్లో)
ఎరువులు అవసరం అందుబాటులో
ఉన్నది
యూరియా 35,000 18,000
డీఏపీ 13,000 4,000
కాంప్లెక్స్ 36,000 24,000
ఎంఓపీ 7,000 1,134
ఎస్‌ఎస్‌పీ 4,000 1,071
కొరత లేదు..
వానాకాలం సాగు కోసం రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఈసారి పత్తి విత్తనాలను అంచనాకు మించి సరఫరా చేసేందుకు ఆయా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి కొరత లేదు. ఇతర విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎరువులను కోటా మేరకు సరిపడా ఉండేలా చర్యలు చేపడుతున్నాం.
– శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి

● వానాకాలం పంటల కోసం.. ● దుక్కులు సిద్ధం చేస్తున్న రైతు

● వానాకాలం పంటల కోసం.. ● దుక్కులు సిద్ధం చేస్తున్న రైతు