ఇక సన్నబియ్యం.. | - | Sakshi
Sakshi News home page

ఇక సన్నబియ్యం..

Mar 24 2025 6:10 AM | Updated on Mar 24 2025 6:11 AM

● రేషన్‌కార్డుదారులకు ఉగాది కానుక ● ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీకి ఏర్పాట్లు ● లబ్ధిదారుల్లో హర్షం

పంపిణీకి చర్యలు

పేదలకు సన్నబియ్యం అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఆ దిశగా డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లాకు అవసరమైన సన్నబియ్యం కోటాను ఈ సారి నిజామాబాద్‌ జిల్లాకు కేటాయించారు. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి లబ్ధిదారులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.

–ఎండీ.వాజీద్‌అలీ,

జిల్లా పౌరసరఫరాల అధికారి

కై లాస్‌నగర్‌: ఉగాది పండగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తీపి కబురు అందించింది. ఆహారభద్రత కార్డుదారులకు ఏప్రిల్‌ 1నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే అక్రమంగా సాగుతున్న రేషన్‌ బియ్యం దందాకు చెక్‌పడే అవకాశముంది.

అక్రమ దందాకు చెక్‌..

ఆహారభద్రత కార్డుదారులకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తోంది. ఇవి దొడ్డువి కావడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడటం లేదు. అలాంటి వారు తమకు రావాల్సిన కోటా బియ్యంను డీలర్లకే కిలో రూ.13 నుంచి రూ.15 చొప్పున విక్రయించేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యంను డీలర్లు వ్యాపారులకు రూ.20 నుంచి రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. మరి కొంతమంది బియ్యంను నెలల తరబడి నిల్వ చేసి తమ ఇంటి వద్దకు ఆటోలతో వచ్చే వారికి అమ్ముతున్నారు. పేదలకు అందాల్సిన ఈ రేషన్‌ బియ్యంను దళారులు, వ్యాపారులు కలిసి మహారాష్ట్రకు లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ దందా యథేచ్ఛగా సాగతూ వస్తోంది. తాజాగా సన్నబియ్యం పంపిణీ ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

నాణ్యతపై సందేహాలు

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సన్నబియ్యం అందించే ప్రయత్నం చేసినప్పటికీ నాణ్యత కొరవడింది. రెండు, మూడు నెలల పాటు సరఫరా చేయగా అందులో నూకలు, తౌడు రావడంతో పేదలు వాటిని తినకుండా వ్యాపారులకు విక్రయించారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేయనున్న బియ్యం నాణ్యతపై కార్డుదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్‌ అందజేసి కొనుగోలు చేయడంతో నాణ్యమైన బియ్యం వచ్చే అవకాశముందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదలకు మేలు చేకూరనుంది.

కొత్త కార్డుదారులకు లేనట్లేనా...

సర్కారు నిర్ణయంపై ఆహారభద్రత కార్డుదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా కొత్తకార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రం నిరాశే మిగులుతుంది. కొత్త కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్ట్‌గా మండలానికి ఒక గ్రామం చొప్పున 17 గ్రామాల్లోని 800 మందికి మాత్రమే జారీ చేసింది. వాటికి బియ్యం కోటా కూడా విడుదల చేసింది. మిగతా గ్రామాల వారికి కార్డులు జారీ చేయనుండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కార్డులు రాకపోవడంతో వారికి సన్నబియ్యం పొందే అవకాశం లేకుండా పోతుంది.

జిల్లాలోని ప్రజా పంపిణీ వివరాలు

చౌక ధరల దుకాణాలు : 356

మొత్తం రేషన్‌కార్డులు : 1,92,233

కార్డుల్లోని యూనిట్లు : 6,32,819

అవసరమైన బియ్యం కోటా : 4,035

మెట్రిక్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement