● ఆయన వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థులు ● ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఘటన
బోథ్: పాఠశాలకు హెచ్‌ఎం తరచూ ఆలస్యంగా వస్తున్నారని, హాల్‌టికెట్లు ఇవ్వమని భయపెడుతున్నారని విద్యార్థులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. మండలంలోని ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్‌ఎం రాజు చోప్డే వాహనాన్ని పాఠశాల గేటు వద్ద శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. పదో తరగతి గది బయట విద్యార్థులు భైఠాయించారు. హెచ్‌ఎం ప్రతీరోజు పాఠశాలకు ఆలస్యంగా రావడం సరికాదన్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి తరచూ పాఠశాలకు వస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఆ వ్యక్తి పాఠశాలకు మద్యం తాగి వచ్చి హంగామా చేయడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉండటంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వారితో మాట్లాడారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మహమూద్, ఎంపీడీవో రమేశ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.