● కలెక్టర్ రాజర్షి షా ఆదేశం ● కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
కై లాస్‌నగర్: మే 4వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణకు జిల్లాలో పరీక్షాకేంద్రాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీట్ అర్హత పరీక్ష కోసం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్కూళ్లు, ఆర్మీ స్కూ ళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, సీబీఎస్‌ఈ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలను సందర్శించి అందులో మౌలిక వసతులు కల్పించాలని, ఆ తర్వాతే నివేదిక అందించాలని సూచించారు. పరీక్షాకేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు పర్యవేక్షించాలని సూచించారు. వీటిపై అధికారులందించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ గదిలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా విద్యాధికారి ప్రణిత, కళాశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.