దీక్ష గురువు శ్రీ సంత్ ప్రేంసింగ్ మహారాజ్‌ను సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు
● ఘనంగా గురుకృప దినోత్సవం ● జనసంద్రమైన జాతీయ బంజారా దీక్షభూమి ● హాజరైన జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు
నార్నూర్: గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్ గ్రామంలోని జాతీయ బంజారా దీక్ష భూమి వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో దీక్ష భూ మి జనసంద్రమైంది. గురువారం దీక్ష గురువు శ్రీ సంత్ ప్రేంసింగ్ మహారాజ్ భోగ్‌బండారో మ హాపూజ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీలు రవీందర్‌నాయక్, రా థోడ్ రమేశ్, గెడం నగేశ్ పాల్గొని గురువు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దీక్ష గురువు భక్తులకు హీత బోధనలు చేశారు. సేవాలాల్ మ హారాజ్, శ్రీ తపస్వీ రామారావు మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
రూ.100 కోట్లు కేటాయించాలి
మహారాష్ట్రలోని పౌరదేవి తర్వాత దేశంలోనే బంజారాల రెండో పుణ్యక్షేత్రమైన జాతీయ బంజారా దీక్ష భూమి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ కోరారు. లంబాడీ గిరిజనుల ఆరాధ్యుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీక్ష గురువు ప్రేంసింగ్ మహారాజ్ చూపిన సన్మార్గంలో నడవాలన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి
తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిఒక్కరూ కాపాడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. నేటి తరం యువతీ యువకులు సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతున్నారన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరమేనని అన్నారు. వరకట్నం నిషేధించేలా సమాజం పెద్దలు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పరంగా దీక్ష భూమి అభివృద్ధికోసం తనవంతు కృషి చేస్తానన్నారు. దీక్ష గురువు ప్రేంసింగ్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని సూచించారు.
ఐక్యతతోనే ఏదైనా సాధ్యం
సమాజంలో ఐక్యతగా ముందుకు సాగినప్పుడే అభివృద్ది సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జా దవ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలన్నారు. కొత్తపల్లి–హెచ్ గ్రామంలోని జాతీ య బంజారాదీక్ష భూమి తెలంగాణలోనే లంబాడీ గిరిజనుల ఆరాధ్య పుణ్యక్షేత్రమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్ర త్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బంజారాల ఐక్యతే శ్రీరామ రక్ష
బంజారాల ఐక్యతే శ్రీరామరక్ష అని వరంగల్ మాజీ ఎంపీ రవీందర్‌నాయక్ అన్నారు. లంబాడీల రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన వారిలో నేనుండడం గర్వంగా ఉందన్నారు. దేశంలోని బంజారాలు ఒకే గొడుకు కిందకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ లేక బంజారాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల బంజారాలతో ఐక్యత సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జాదవ్ రెడ్డినాయక్, గ్రామ నాయక్ ఠాక్రునాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత రాథోడ్, ఎంపీటీసీ రేణుక దిలీప్ జాదవ్, సర్పంచ్‌లు సుభద్రబాయి రాథోడ్, విష్ణు రాథోడ్, మధుకర్ రాథోడ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ జాదవ్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు యూనుస్ అక్బానీ, పల్లకి శోభాయాత్ర అధ్యక్షుడు రమేశ్ రాథోడ్, పీఏసీఎస్ చైర్మన్ అడే సురేశ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
దీక్షభూమి వద్ద నృత్యం చేస్తున్న జెడ్పీచైర్మన్


