
ఎరువుల దుకాణం
● చేతులెత్తేసిన ఎరువుల కంపెనీలు ● చోద్యం చూస్తున్న అధికారులు
నేరడిగొండ: కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ కేంద్రాల్లో రైతులకు తగిన సేవలు అందడం లేదు. రైతులకు అన్నిరకాల సేవలు ఒకేచోట అందించేలా ఎరువుల దుకాణాలన్నింటిని పీఎం కిసాన్ కేంద్రాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఎరువులు, పురుగు మందులు, భూసార పరీక్షలు, సాగులోని మెళకువలు, ఇతర సేవలను రైతులకు అందించాలి. జూలై 27న రాజస్థాన్‌లో కేంద్రాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. దీంతో జిల్లాలోని 300 పైచిలుకు వివిధ ఎరువుల కంపెనీలు, ఎరువుల దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి కేంద్రాలను ప్రారంభించారు. ఇంటర్‌నెట్ సదుపాయం, ఎల్‌ఈడీ టీవీలు, రైతులు కూర్చునేందుకు కుర్చీలు సమకూర్చారు.
ఇది పరిస్థితి..
కేంద్రం అందించే డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను రాయితీతో విక్రయిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శాస్త్రవేత్తలతో నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా పంటల సాగులో రైతులకు ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేస్తూ సూచనలు అందించాలి. భూసార పరీక్షలను నిర్వహించి ఫలితాలు తెలియజేయాలి. ఏ ఎరువు ఎంత మోతాదులో వాడాలో చెప్పాలి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. కొన్నిచోట్ల బోర్డులు పెట్టి ఫొటోలు తీసుకుపోయారే తప్పా.. సౌకర్యాలు కల్పించలేదు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు చోట్ల ఎరువులు విక్రయించడం నిలిపివేసిన దుకాణాల వద్ద కూడా బోర్డు పెట్టారంటే చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 300లకు పైగా ఎరువుల దుకాణాలు ఉండగా విడతల వారీగా అన్నింటిని పీఎం కిసాన్ కేంద్రాలుగా మారుస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎరువుల కంపెనీల అధికారులు తెలిపారు. కానీ ఇప్పటికీ ఎక్కడా కూడా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టలేదు.
పర్యవేక్షణ కరువు..
కేంద్రం తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు పర్యవేక్షణ జరపాలి. కానీ వారు పూర్తిగా దూరంగా ఉన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్యను ‘సాక్షి’ సంప్రదించగా పీఎం కిసాన్ కేంద్రాల పనితీరుపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కొన్ని కంపెనీల ప్రతినిధులను వివరణ కోరగా, అన్ని ఎరువుల దుకాణాల్లో రైతుల అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలోనిప్రతి ఎరువుల కేంద్రంలో కేంద్రం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తామని తెలిపారు. వాటిని సరిదిద్దేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని వివరించారు.