
శిబిరంలో కూర్చున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
● కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ రిలే దీక్ష
కైలాస్‌నగర్: అధికారంలోకి వచ్చిన వంద రోజు ల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దాన్ని నిలబెట్టుకుని మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎన్నో కమిషన్లు వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో వర్గీకరణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ సమావేశాల్లో తీర్మానం చేయాలని, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో కేంద్రానికి లేఖలు రాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, గణేష్, శ్రీహరి, వేణు జైపాల్ తదితరులు పాల్గొన్నారు.