
వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో
ఆదిలాబాద్‌టౌన్: చిన్న పిల్లల్లో వచ్చే తట్టు(మజిల్ రెబెల్లా) వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. వ్యాధి నివారణ కోసం పట్టణంలోని సుభాష్‌నగర్‌లో మంగళవారం వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మజిల్ రెబెల్లా కేసులు పెరగడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 13 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఒక పీహెచ్‌సీ పరిధిలో ఒకటికి మించి కేసులు నమోదైతే ఆ ప్రాంతంలో వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికి వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలను తల్లిదండ్రులు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఒకవేళ టీకా తీసుకోనట్లయితే అంగన్‌వాడీ కేంద్రంతో పాటు సంబంధిత పీహెచ్‌సీ పరిధిలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.