
● రేషన్‌కార్డు అందక పేదల ఇక్కట్లు ● తొలగింపులు సరే.. చేర్పులేవి? ● ఏళ్లుగా తప్పని ఎదురుచూపు ● సంక్షేమ ఫలాలు పొందలేకపోతున్న అర్హులు
బోథ్‌కు చెందిన ఈయన పేరు మల్లెపూల విజయ్‌కుమార్. ఐదేళ్ల క్రితం ఈయనకు కుమారుడు జన్మించాడు. బాబుపేరు రేషన్ కార్డులో చేర్పించేందుకు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా పేరు నమోదు చేయలేదు. దీంతో బాబుకు సంబంధించిన రేషన్ బియ్యం పొందలేకపోతున్నాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు.
ఈఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు లడేవార్ సంజీవ్. బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. ఐదేళ్ల క్రితం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ కార్డు రాలేదు. దీంతో రేషన్ బియ్యం పొందలేకపోతున్నాడు. ప్రభుత్వ పథకాలకూ దూరమవుతున్నాడు. వీరే కాదు.. జిల్లాలో చాలామంది రేషన్‌కార్డుల్లో వివరాల చేర్పులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

