ఆదిలాబాద్‌టౌన్: కూలీనాలీ చేసుకుని కూడబెట్టుకున్న డబ్బులను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పరిధిలోని మహాలక్ష్మివాడకు చెందిన ఎడిపెల్లి స్వామి నివాసముంటున్నాడు. రజకవృత్తి చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 25న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో స్వామి తన కుటుంబీకులతో భీంపూర్ మండలం పిప్పల్‌కోఠి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి రూ.10వేల నగదు, 5 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు 26న తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఫోన్ ద్వారా బాధితుడికి సమాచారమందించారు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము దొంగల పాలు కావడంతో కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు.