breaking news
unnatural death
-
మగపులిని మట్టుబెట్టారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మగపులిది అసహజ మరణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ దరిగాం–సర్కెపల్లి మధ్య బూడిదమామిడి అడవుల్లో ఈ నెల 6న ఏడాదిన్నర ఆడపులి, ఈ నెల 8న ఐదేరాళ్ల మగపులి (ఎస్9) కళేబరాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆడపులి మరోపులితో పోరులో చనిపోగా, మగపులి విషంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నియమించిన టీంతో కలిసి పీసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియల్, చీఫ్ వైల్డ్‌లైఫ్ ఇన్చార్జి ఎంసీ పర్గేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ ఎఫ్డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, పశువైద్యాధికారులు, ఎన్జీఓ, ఇతర సిబ్బందితో వివరాలు తీసుకున్నారు. అనంతరం ఎన్టీసీఏ నిబంధనల మేరకు అడవిలోనే పులి, పశుకళేబరాలను దహనం చేశారు. పులిపై విష ప్రయోగం ఒక పులి అంతర్గత పోరులో, మరో పులి విషం పెట్టడంతో చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. మగపులి మెడకు ఉచ్చు కూడా ఉంది. అది వదులుగా ఉంది. పులి ఉచ్చు పడితే తనంతట తాను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కనిపిస్తున్న ఆధారాలను బట్టి పులి వేటాడిన పశుకళేబరంలో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చు. దానిని తిన్న పులి చనిపోయి ఉండొచ్చనిపిస్తోంది. నమూనాలు మూడు ల్యాబ్‌లకు పంపుతున్నాం. నివేదిక వస్తే స్పష్టత వస్తుంది. ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణలో స్థానిక పోలీసు సాయంతో నేరస్తులను పట్టుకుంటాం. – ఆర్ఎం డొబ్రియల్ పులులెలా చనిపోతున్నాయి? సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ కారిడార్‌లో వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మొదట రెండు పులుల ఆవాస ఆధిపత్య పోరులో ఒకటి చనిపోయిందని తేల్చారు. మరో పులి అదే తీరుగా పొట్లాటలో మృతి చెందిందని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకేచోట రెండు మరణించడం, పశువుల కళేబరాలు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలైంది. ‘తడోబా–అందేరి’, ‘తిప్పేశ్వర్’కు పెన్‌గంగా, ప్రాణహిత పక్కనే ఉన్న కాగజ్‌నగర్ పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. దరిగాం సమీపప్రాంతాల్లోనే ఎస్9 మగపులి, ఎస్6 అనే ఆడపులితో జతకట్టడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. వాటి వయసు రెండేళ్లు దాటడంతో ఆవాసం వెతుక్కుంటున్నాయి. మరోవైపు ఎస్6 కోసం మరో మగపులి రావడం, అక్కడే ఎస్9 కూడా ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇలా తల్లి, నాలుగు పిల్లలు, మగపులులతో అక్కడే సంచరిస్తున్నాయి. అడవిలో వన్యప్రాణుల లభ్యత లేక స్థానిక గిరిజన రైతుల పశువులే వాటికి ఆహారంగా మారాయి. రెండేళ్లుగా ఆరు పశువులను చంపగా, కొందరికే పరిహారం రాగా, మరికొందరికి అందలేదు. పశువులపై దాడులతో ప్రతీకారమా... పశువులను చంపేస్తున్న పులులను హతమార్చాలని ఎవరైనా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ మొదలైంది. గతంలో పులులకు ఉచ్చులు బిగిసి ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం చెన్నూరు డివిజన్లో అమర్చిన ఉచ్చుకు కే4 ఆడపులి చిక్కి నడుము భాగంలో ఉండిపోయింది. ఇప్పటికీ ఆ పులి జాడ లేదు. అదే డివిజన్ శివ్వారం, ఉట్నూరు డివిజన్‌లోనూ ఉచ్చులతో పులులకు ముప్పు జరిగాయి. ఎస్6, ఆ పిల్లలు సురక్షితమేనా? ఎస్6తోపాటు మరో మూడు పిల్లలు క్షేమంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. పులుల మరణానికి ముందు చివరగా దరిగాం పరిధిలోనే ఓ పశువును హతమార్చి భుజిస్తుండగా కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత వాటి జాడ లేదు. ఆవాసాల ఆధిప్యత పోరు, కొత్త పులి రాకతో ఘర్షణతో వేరే చోటుకు వెళ్లాయా? లేక విషం, ఉచ్చుల బారిన పడ్డాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ఆచూకీకి 50 మంది యానిమల్ ట్రాకర్స్ వెతుకుతున్నారని, ఈ చుట్టుపక్కల యాభైదాకా కెమెరా ట్రాక్‌లను అమర్చి పర్యవేక్షిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
సుప్రీం’ ఆదేశాలపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో 2012 నుంచి 2015 మధ్య కాలంలో అసహజ మరణానికి గురైన ఖైదీల కుటుంబ సభ్యులను గుర్తించి, వారికి పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్పందించింది. ఉభయ రాష్ట్రాల్లోని జైళ్లలో నెలకొని ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అసహజ మరణానికి గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఇందులో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, జైళ్ల శాఖ డీజీలతో పాటు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్‌పై శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జైళ్లలో అమానవీయ పరిస్థితులు, అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించి పరిహారం చెల్లించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తెలపాలని ఉభయ రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు కోరనుంది. జైళ్లలో దుర్భర పరిస్థితులపై 2013లో దాఖలైన పిల్‌ను ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు, 2012–15 మధ్య కాలంలో జైళ్లలో పెద్ద ఎత్తున అసహజ మరణాలు చోటు చేసుకుంటున్నాయన్న ఎన్సీఆర్బీ గణాంకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అసహజ మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం పొందే హక్కు ఉందని తెలిపింది. ఇలాంటి వారిని గుర్తించి పరిహారాన్ని అందించాలని, అందుకు ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నుంచి తీర్పు కాపీ అందుకున్న హైకోర్టు ఈ మేర చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సుమోటో పిల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. -
అసహజ మరణమే
సునందపుష్కర్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల ప్రకటన శశిథరూర్ భార్య మరణంపై బలపడుతున్న అనుమానాలు మృతదేహానికి ఎయిమ్స్‌లో వైద్యుల బృందం పోస్టుమార్టం ఆమె శరీరంపై గాయాలను గుర్తించినట్లు వైద్యుల వెల్లడి విషప్రయోగం అవకాశాన్నీ కొట్టివేయని వైనం లోతైన పరీక్షలకోసం శరీరం నుంచి నమూనాల సేకరణ రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తామన్న వైద్యులు పోస్టుమార్టం సమయంలో ఎయిమ్స్‌లోనే థరూర్ ఛాతీనొప్పి, గుండెదడతో ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి సునంద మృతి వెనుక కుట్ర ఉందన్న ఆమె బంధువులు ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ది ఆకస్మిక, అసహజ మరణమని.. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు స్పష్టంచేశారు. ఆమె శరీరంపై కొన్ని గాయాలను కూడా గుర్తించామని తెలిపారు. ఆమెపై విషప్రయోగం జరిగిందనే అవకాశాన్నీ కొట్టివేయలేమని పేర్కొన్నారు. తన భర్త శశిథరూర్‌కు పాక్ జర్నలిస్టు మెహర్తరార్తో వివాహేతర సంబంధం ఉందని, తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మెహర్ ప్రయత్నిస్తున్నారని గురువారం తీవ్ర ఆరోపణలు చేసిన సునందపుష్కర్ (52) ఆ మరుసటి రోజు శుక్రవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని శుక్రవారం రాత్రికే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రికి తరలించగా.. శనివారం మధ్యాహ్నం ముగ్గురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. సునందది అసహజ మరణమని, ఆమె శరీరంపై పలు గాయాలున్నాయని వైద్యులు ప్రాథమికంగా చెప్పటంతో.. ఆమె మరణంపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇదిలావుంటే.. సునంద మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె భర్త, కేంద్రమంత్రి శశిథరూర్ తనకు ఛాతీనొప్పి వస్తోందం టూ అదే ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సునంద మృతదేహానికి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో.. ఆయన ఆస్పత్రిలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. థరూర్‌కు ఈసీజీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం మామూలుగానే ఉందని నిర్ధారించి.. తర్వాత డిశ్చార్జ్ చేశారు. జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన సునంద ఆత్మహత్య చేసుకున్నారనే వాదనను ఆమె బంధువులు కొట్టివేశారు. ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తంచేస్తూ.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సునందకు ఎలాంటి తీవ్ర అనారోగ్యం లేదని.. కొద్దిరోజుల కిందట ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తిరువనంతపురం కిమ్స్ వైద్యులు ప్రకటించారు. సునంద భౌతికకాయానికి ఢిల్లీ లోధీరోడ్డులోని శ్మశానవాటికలో బంధువుల సమక్షంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక సునంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల బృందానికి ఎయిమ్స్ ఫోరెన్సిక్ సెన్సైస్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కె.గుప్తా నేతృత్వం వహించారు. ఫోరెన్సిక్ మెడిసిన్స్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఆదర్శ్‌కుమార్, అదే విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శశాంక్పునియాలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. అనంతరం.. పోస్టుమార్టంలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలను డాక్టర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్కుమార్లు మీడియాకు తెలిపారు. ముఖ్యాంశాలివీ... ‘‘మేం పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాం. సునందపుష్కర్ది ఆకస్మిక, అసహజ మరణం. విషప్రయోగం జరిగిన దాఖలాలు లేవు. ఆమె శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి.. ఆ గాయాల వివరాలను నేను బహిర్గతం చేయలేను. సాధారణంగా.. మెడికో - లీగల్ కేసుల్లో గాయాల సంఖ్య ఎంత అనే దానికి ప్రాధాన్యం లేదు. ఆ గాయాలకు మరణంతో సంబంధం ఉందా? లేదా? అన్నదే ముఖ్యం. సునంద శరీరంపై గాయాల వల్ల ఆమె మరణం సంభవించిందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు వెల్లడించలేను. మరణానికి కారణం విషప్రయోగం కాదు అని ఇప్పుడే చెప్పలేం. దీనికి సంబంధించి లోతైన పరీక్షలు, విశ్లేషణల కోసం సునంద శరీరభాగాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వంటి అంతర్గత అవయవాల నుంచి కొన్ని నమూనాలు సేకరించాం. ఈ పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల్లో తుది పోస్టుమార్టం నివేదికను రూపొందిస్తాం. ఆకస్మిక, అసహజ మరణానికి సంబంధించి వైద్య కోణంపై కేంద్రీకరించి ఈ నివేదిక ఉంటుంది. దీనిని సోమవారం సీల్డ్ కవర్లో కేసు దర్యాప్తు చేస్తున్న సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌కు అందజేస్తాం. సునంద కడుపులో క్షయ, లూపస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. దీనిపై ఆమె తీసుకున్న చికిత్స వివరాల్ని అందించాలని కోరాం.’’ ముఖం, చేయిపై గాయాలు!: సునంద ముఖం, చేతి మీద గాయాలున్నట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కానీ.. ఆ గాయాలు ఆమె మరణానికి కారణం కాదని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అభిప్రాయపడ్డట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటల మధ్య సునంద చనిపోయినట్లు వైద్యులు అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒక వ్యక్తి ఎక్కువ మోతాదులో మద్యం సేవించటం.. స్పృహ కోల్పోయి, శ్వాసనాళాలు మూసుకుపోయి, గ్యాస్ట్రిక్ ఆస్పిరేషన్కు తద్వారా తీవ్రమైన న్యుమోనియాకు, చివరికి మరణానికి కారణమైన ఉదంతాలున్నాయని ఒక వైద్యుడు పేర్కొన్నారు. అయితే.. సునంద కేసుకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.. పూర్తిస్థాయి పోర్టుమార్టం నివేదిక అందకుండా ఆమె మరణానికి కారణాలపై అంచనా వేయటానికి నిరాకరిస్తున్నారు. మీకు తోడుగా ఉన్నాం థరూర్‌కు ప్రధాని లేఖ న్యూఢిల్లీ: సునంద మృతిపై ప్రధాని మన్మోహన్ దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆమె భర్త, మంత్రి థరూర్‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శని వారం లేఖ రాశారు. ‘ఈ విషాద సమయంలో మీకు తోడుగా ఉన్నామ’న్నారు. కాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మంత్రులు ఆంటోనీ, వయలార్ రవి తదితరులు ఢిల్లీలోని థరూర్ ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించారు. చితికి నిప్పంటించిన సునంద కుమారుడు సునందపుష్కర్ భౌతికకాయానికి శనివారం లోధీ రోడ్డు శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. సునంద చితికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె కుమారుడు శివ్‌మీనన్ (21) కన్నీళ్ల పర్యంతమవుతూ నిప్పంటించారు. ఆమె భర్త శశిథరూర్ తీవ్ర విచారంలో మునిగిపోయి కర్మకాండలు నిర్వహించారు. సునంద తండ్రి పుష్కర్నాథ్దాస్, సోదరుడు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు.. ఎయిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సునంద భౌతికకాయాన్ని లోధీ ఎస్టేట్ వద్ద శశిథరూర్ నివాసానికి తరలించారు. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితర ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఆమెకు తీవ్ర అనారోగ్యమేదీ లేదు’ తిరువనంతపురం: అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సునందకు ఎలాంటి తీవ్రమైన అనారోగ్యమూ లేదని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(కిమ్స్) వైద్యుల బృందం స్పష్టం చేసింది. చాలా మంది లాగానే సునంద సాధారణ వైద్యపరీక్షలకోసం 12న తిరువనంతపురంలోని కిమ్స్‌లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆమె భర్త కూడా ఆమెతోపాటు ఉన్నారని.. పరీక్షలు పూర్తయ్యాక 14న డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. వైద్యపరీక్షల ఫలితాలు పూర్తిగా వచ్చాక మరోసారి వైద్యులను సంప్రదించేందుకు సునంద ఇంకో వారంలో మళ్లీ ఆస్పత్రికి రావాల్సి ఉందని వెల్లడించారు. శుక్రవారం ఆమె అనుమానాస్పద మరణం నేపథ్యంలో.. కిమ్స్ వైద్యుల బృందం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయరాఘవన్ నేతృత్వంలో సమావేశమై.. సునంద వైద్య పరీక్షల నివేదికలను అధ్యయనం చేసింది. ఆమెకు ఎలాంటి సీరియస్ అనారోగ్యమూ లేదని ఆ తర్వాత విజయరాఘవన్ మీడియా భేటీలో వెల్లడించారు. మరణంపై సీబీఐ దర్యాప్తు: సునంద బంధువుల డిమాండ్ ‘‘సునంద నాకు మేనత్త కూతురు. నేను తనకు కుమారుడి లాంటి వాడినని ఆమె చెప్తుండేవారు. ఆమెకు మైగ్రేన్ (తరచుగా వచ్చే తలనొప్పి) తప్ప మరెలాంటి తీవ్రమైన వ్యాధీ లేదు. తన జీవితంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆమె తీవ్ర కలతకు లోనయ్యారనటం నిజమే. ఆమె చాలా ధైర్యవంతురాలు. జీవితంలో ఎదగటానికి చాలా పోరా టం చేశారు. ఆమె తననుతాను మలుచుకున్న మహిళ. ఆమెలాంటి వారు ఆత్మహత్య చేసుకోరు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. దుర్దినాలు చూశారు. ఆమె మనుగడ కోసం పోరాడటాన్ని మేం చూశాం. బంధువులకు సాయం చేయటానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని సునంద బంధువు, జమ్మూకాశ్మీర్‌లో నివసించే సంజయ్పండిత, ఆయన భార్య అనుపండిత డిమాండ్ చేశారు.