రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు
ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు
విజయవాడ(భవానీపురం)
ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలతో భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కర ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారం ఆయన పున్నమి(వీఐపీ) ఘాట్లో పుష్కర స్నానం చేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అమరావతి రాజధానిలో తొలి కృష్ణా పుష్కరాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పుష్కరాలలో చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ నదులను గౌరవించాలని, పితృదేవతలు దీవించే విధంగా పిండ ప్రదానాలు చేయాలని అన్నారు.