టాక్సీలకు ఎలక్ట్రానిక్ చిప్‌లు.. : మహేశ్ శర్మ
న్యూఢిల్లీ: పర్యాటకులకు భద్రత కల్పించడం కోసం.. టూరిస్టు టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యాటకులు, వాహనాల కదలికలను గమనించవచ్చని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక మహిళా పర్యాటకురాలిని డెహ్రడూన్‌లో అత్యాచారం చేసి, హత్య చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ శర్మ.. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకుల భద్రతకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఈ చిప్‌లను అమర్చిన టాక్సీల డ్రైవర్లకు సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయని, దీనిని మూడు నెలల్లోగా అమలు చేస్తామని మహేశ్ శర్మ తెలిపారు. ఈ విధానం వల్ల పర్యాటకులను టాక్సీ డ్రైవర్లు మోసం చేయడం, అధికంగా డబ్బు వసూలు చేయడం వంటివాటిని కూడా నివారించవచ్చని వెల్లడించారు.