breaking news
thief and police
-
దొంగలతో కుమ్మక్కు!
ఈ నెల 21 మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రూ.80 వేలు లంచం తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గేదెల చోరీ కేసులో నిందితులతో ఎస్ఐ నర్సింహులు బేరమాడాడు.డబ్బులు ఇస్తే తక్కువ శిక్ష పడేలా చూస్తానని, లేదంటే.. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తానని దొంగలను బెదిరించాడు. దీంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఎస్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సీఐ అర్జునయ్యకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఆయనను కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. హయత్‌నగర్ పోలీస్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ)గా పనిచేస్తున్న జితేందర్‌రెడ్డి సోమవారం లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. బంగారం దొంగతనం కేసులో నిందితులపై కేసు నమోదు చేయకుండా.. బాధితురాలితో సెటిల్మెంట్ చేసేందుకు నిందితుల నుంచి రూ.1.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో ఇప్పటికే రూ.55 వేలు తీసుకున్న డీఐ.. మరో రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం జిల్లాలో కలకలం రేపుతోంది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. దొంగలతో చేతులు కలుపుతున్నారు. ఇటువంటి కొందరు పోలీసుల నిర్వాకం వల్ల మొత్తం పోలీస్ శాఖపై మచ్చపడుతోంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ.. నిందితులకు లబ్ధిచేకూర్చుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ట్రెండ్ మార్చారు.. పోలీసులకు నెలవారీ మామూళ్లు తగ్గిపోయాయి. అక్రమ వ్యాపారులు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, లాడ్జీలు, బార్లు, వైన్సులు, పార్కింగ్ లేని హోటళ్లు తదితర వాటి నుంచి ఇంతకుముందు నెలవారీ మామూళ్లు తీసుకునేవారు. అయితే, గత ఏడాది జూన్‌లో ఈ తరహా వసూళ్లు చేస్తున్న కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇంకొందరిపై బదిలీ వేటు వేశారు. కొంత కాలంగా అందరిలో చైతన్యం పెరిగిపోవడంతో పోలీసులు గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోమామూళ్ల వనరులు దాదాపుగా తగ్గిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కేసుల్లో దండుకుంటున్నారు. ఏదో ఒక రకంగా బాధితులను, నిందితులను బెదిరించి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. నెలకు రెండు, మూడు కేసులు లభిస్తే.. రూ.లక్షల్లో వెనకేసుకుంట్నుట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టుబడేవి కొన్నే.. లంచం ఇవ్వంది పోలీసు స్టేషన్లలో ఏ పనీ కావడం లేదు. న్యాయం జరగాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తుండడం శోచనీయం. లంచం పుచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్లే కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. డబ్బు డిమాండ్ చేసిన అధికారులే స్వయంగా నగదు తీసుకుంటున్నప్పుడే కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి తప్పించుకునేందుకు ఇతరుల చేతుల ద్వారా, కొత్త ప్రదేశాల్లో లంచం తీసుకుంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో కేసులు బయటికి రావడం లేదు. పలువురిపై నిఘా.. ఆయా కేసుల్లో లంచం డిమాండ్ చేసిన ఘటనల వివరాలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నట్లు తెలిసింది. బాధితులు వీరికి ఫిర్యాదు ఇవ్వడంతో.. సదరు పోలీసులపై నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సమయం చూసుకుని దాడులు చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. అయితే పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా, ఫోన్లలో తమకు భారీగా ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందని, దానికి తగిన ప్రాథమిక సమాచారం ఇవ్వడంలో బాధితులు ధైర్యం చేయలేకపోతున్నారని ఓ అధికారి తెలిపారు. -
ఒక్కటైన దొంగ.. పోలీస్ !
కదిరి: ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని గత వారం రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ దొంగలు, పోలీస్ అధికారులు ఒక్కటై ఎవరింట్లో దొంగతనం జరిగిందో ఆ బాధితులను పోలీస్ అధికారులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నట్లు సమాచారం. ‘రేయ్ మీ ఇంట్లో 30 తులాలు దొంగతనం అయినట్లు మాకు ఆరోజు ఫిర్యాదులో ఇచ్చావ్. కానీ మీ ఇంట్లో దొంగ ఆరోజు ఎత్తుకెళ్లింది కేవలం 5 తులాలు మాత్రమేనని ఆ దొంగ మాతో చెప్పాడు. రేపో, మాపో ఆ 5 తులాలు రికవరీ చూపిస్తాం. వచ్చి తీసుకెళ్లు..మీ ఇంట్లో ఎంత దొంగతనం అయిందో అంతా రికవరీ చేసి ఇవ్వాలని ఏ చట్టంలో లేదు. మర్యాదగా ఇచ్చింది తీసుకెళ్లు’ అంటూ పోలీస్ అధికారులు బాధితులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకో బాధితుడు ఆరోజు తన ఇంట్లో ఒక ఎల్ఈడీ టీవీ, 5 తులాల బంగారంతో పాటు రూ.50 వేలు నగదు పోయిందని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. అయితే టీవీ రికవరి చేయడం సాధ్యం కాదంటూ ఆరోజు పోలీసు అధికారులే ఆ బాధితుడిని తన ఫిర్యాదులో టీవీ విషయం రాయద్దని చెప్పి అలాగే ఫిర్యాదు ఇప్పించుకున్నారు. అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న దొంగ తాను సదరు వ్యక్తి ఇంట్లో టీవీ కూడా ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు చేసేది లేక టీవీని సదరు బాధితుడికి అందజేశారు. అయితే అతని ఇంట్లో దోచుకెళ్లిన 5 తులాలు అబద్దమని, దొంగకూడా ఇదే చెబుతున్నాడంటూ బాధితుడిని పోలీసులు బయటకు గెంటేసినట్లు తెలిసింది. దొంగ.. తాను ఏ ఇంట్లో ఎంత దోచుకున్నాడో.. ఏ బంగారు షాపులో అమ్మాడో చెప్పినప్పటికీ పోలీసు అధికారులు మాత్రం బాధితులకు అన్యాయం చేసి, తాము ఇచ్చింది తీసుకోండి అంటూ బెదిరిస్తున్నారట. నేడో, రేపో పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న దొంగలను మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలిసింది.