breaking news
Tenth Model Papers
-
Telangana: త్వరలో టెన్త్ మోడల్ పేపర్
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కొత్త మోడల్ పేపర్ వెలువరించనుంది. వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ తర్వాత పాఠశాలలకు పంపుతామని అధికారులు తెలిపారు. వ్యాస రూప, సూక్ష్మ రూప ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు తెచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితమే టెన్త్ సిలబస్, పరీక్ష విధానాన్ని వెల్లడించి మోడల్ పేపర్‌ను కూడా విడుదల చేసిన విద్యాశాఖ, ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చి కొత్తది విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ ఈ ప్రక్రియను చేపడుతుంది. త్వరలో పేపర్ రూపకల్పన వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టాల్సి ఉంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి సబ్జెక్టు నిపుణులను రప్పించి, అత్యంత గోప్యత పాటిస్తూ మొత్తం 12 సెట్ల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులోంచి మూడింటిని ఎంపిక చేస్తారు. అయితే పేపర్లో మార్పులు చేపట్టాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ ఇంతవరకు చేపట్టలేదు. చాయిస్ పెంచడంతో పాటు వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను కుదించడంతో ఈ మేరకు పేపర్ల రూపకల్పన చేపట్టనున్నారు. ఫిబ్రవరి కల్లా ముద్రణకు.. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు ఎంపిక చేసే మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రింటింగ్‌కు పంపాలని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టి, ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. వీటిని ఫిబ్రవరి నెలాఖరుకు ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌కు పంపనున్నారు. మార్చి మొదటి వారం కల్లా పేపర్ ముద్రణ పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. హెచ్‌ఎంలూ అప్రమత్తంకండి టెన్త్ పరీక్షల విషయంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, మార్పుల విషయంలో విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఏడాది ఆరు పేపర్లతో టెన్త్ పరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఎస్ఏ–1 పరీక్ష పేపర్ల ముద్రణ పూర్తయ్యాక ఈ నిర్ణయం రావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీంతో ఎస్ఏ –1 వరకు 11 పేపర్లతో పరీక్ష పెట్టారు. ఫైనల్ పరీక్ష మాత్రం 6 పేపర్లతోనే నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ప్రశ్నపత్రాల్లో మార్పులతో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు సూచించారు. -
డీఈఓ వెబ్సైట్లో టెన్త్ మోడల్ పేపర్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నాపత్రాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలు కొత్త విధానంలో నిర్వహిస్తున్నందున విద్యార్థులకు అవగాహన కోసం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓరంగారెడ్డి.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.