breaking news
talasemia
-
తలసేమియా విద్యార్థికి ఎంబీబీఎస్ సీటివ్వండి
న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడుతున్న విద్యార్థిని వైకల్యం కేటగిరీ కింద ఎంబీబీఎస్ కోర్సులో చేర్చుకోవాలని ఇంద్రప్రస్థ వర్సిటీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది. వర్సిటీ పరిధిలోని కళాశాలలో చేర్చుకోవాలంది. తలసేమియాతో బాధపడుతున్న తనను వైకల్యం కేటగిరీ కింద వర్సిటీలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జడ్జి జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని జనరల్ కేటగిరీ నుంచి వైకల్యం కేటగిరీకి 2017, జూలై 16న మార్చినట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ యాక్ట్ 2016’ ప్రకారం వైకల్యం ఉన్న వారి రిజర్వేషన్‌ను 3 నుంచి 5కు పెంచిందని ఆ కేటగిరీలో సీటు కేటాయించాలని సూచించింది. -
ప్రాణాలు తోడేస్తోంది..
సి‘కిల్’సెల్ గిరిజన విద్యార్థులను అంటుకున్న వ్యాధి 2,100 మంది బాధితులు తలసేమియా బారినా గిరిజన విద్యార్థులు రక్త పరీక్షల్లో బహిర్గతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎంతో మంది..? ఉట్నూర్ : ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్, తలసేమియా వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎప్పుడూ జ్వరాలు, అతిసార, మలేరియా తదితర వ్యాధులతో బాధపడే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా ఈ వ్యాధులు నమోదవుతుండడం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత విద్యాసంవత్సరంలో గిరిజన ఆశ్రమ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో సికిల్‌సెల్, తలసేమియా కేసులు పదుల సంఖ్యలో వెల్లడయ్యాయి. సికిల్‌సెల్, తలసేమియా వ్యాధుల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గత విద్యాసంవత్సరంలో జిల్లా, ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా 123 ఆశ్రమ పాఠశాలలు, 13 కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 40 వేలకు మందికిపైగా గిరిజన విద్యార్థుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఉట్నూర్ క్లస్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెచ్‌పీఎల్‌పీ వ్యాధి నిర్ధరణ యంత్రం ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీంతో గిరిజన విద్యార్థుల్లో 2100 మంది విద్యార్థులకు సికిల్‌సెల్ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధరించారు. అంతేకాకుండా 1,786 మందికి సికిల్ కారియర్స్ ఉన్నట్లుగా గుర్తించారు. 64 మంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో వ్యాధి ఉన్నట్లు నిర్ధరణకు వచ్చారు. అదీగాకుండా 18 మందికి తలసేమియా మైనర్ స్థాయిలో, 15 మందికి మేజర్ స్థాయిలో ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. మరో 40 మంది విద్యార్థులకు తలసేమియాతోపాటు సికిల్‌సెల్ రెండు వ్యాధులూ ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే.. ప్రభుత్వ ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ కేవలం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు మాత్రమే సికిల్‌సెల్, తలసేమియా వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఏజెన్సీ గిరిజన గ్రామాల్లోని గిరిజనులందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తే ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయో తేలనుంది. జిల్లా జనాభాలో 18.09 శాతం మంది గిరిజనులు ఉన్నారు. 44 మండలాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో 4,95,794 (2011 జనాభా లెక్కల ప్రకారం) గిరిజన జనాభా ఉంది. కొద్ది నెలల క్రితం జైనూర్ మండలంలోని చింతకర్ర గ్రామంలో సికిల్ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతిచెందారు. ఆ సందర్భంలో గ్రామంలోని వారందరికీ రక్త పరీక్షలు చేయగా.. ఒకే కుటుంబంలో ఆరుగురు ఈ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారణకు వచ్చారు. అందుకే.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులందరికీ వైద్య పరీక్షలు చేస్తే వాస్తవ పరిస్థితి వెల్లడికానుంది. పాఠశాలల్లో రక్త పరీక్షలు చేసిన వైద్యాధికారులు సికిల్‌సెల్, తలసేమియా వ్యాధులున్న విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. వారికి ప్రత్యేక కార్డులు అందించాలని భావించారు. అయితే.. కొన్ని గిరిజన సంఘాల నాయకులు విద్యార్థులకు వ్యాధి సోకినట్లు ప్రచారం జరిగితే వారి భవిష్యత్ అంధకారం అవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఆ విధానాన్ని విరమించినట్లు తెలిసింది. ప్రభుత్వం వ్యాధి నివారణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టి గిరిజనుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. సికిల్ సెల్ అంటే.. జన్యు మార్పులతో సంభవించే ప్రాణాంతక వ్యాధి సికిల్ సెల్ అనిమీయా. ముందు జాగ్రత్త తప్ప మందులు లేని వ్యాధి. శరీరంలో గుండ్రని ఆకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాల్లో ఒక జన్యువు మామూలుగా.. మరొకటి కొడవలి ఆకారంలో వంపు తిరిగి ఉంటే.. వారిని సికిల్ క్యారి యర్లుగా పేర్కొంటారు. దీంతో రక్త నాళాల్లో కొడవలి ఆకారం గల జన్యువు శరీరంలో ప్రయాణించ డం కష్టంగా మారుతుంది. జన్యుపరమైన మార్పులతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. తదుపరి ఆయా శరీర భాగాలకు ఆక్సిజన్ అందకుండాపోతుంది. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాల ఆయు ప్రయాణం 125 రోజులు కాగా.. సికిల్ సెల్ సోకిన వారిలో ప్రయా ణం కేవలం 20 రోజులు మాత్రమే. త్వరగా నశించి పోయే రక్తకణాలకు దీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీంతో సికిల్‌సెల్ సోకిన వ్యక్తి రక్తహీనత బారిన పడి మృతిచెందుతాడు. ఇలాంటి లక్షణాలు గల ఆడ, మగా వివాహం చేసుకుంటే వారికి పుట్టే పిల్లల రక్తకణాల్లో రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి. వీరు పుట్టినప్పుటి నుంచే అనారోగ్యంతో బాధపడుతుంటారు. అధిక శాతం ఈ వ్యాధి గ్రస్తులు 15 నుంచి 20 ఏళ్లకే చనిపోతుంటారు. సికిల్ సెల్ వ్యాధిని మూలకణ (బోన్‌మారో) చికిత్స ద్వారా నివారించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మూలకణ చికిత్స అంటే లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. అయితే.. అది అంత సులువుగా కాదని వైద్యులు అంటున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నిర్వహించిన రక్త పరీక్షల ద్వారా సికిల్‌సెల్, తలసేమియా సోకిన విద్యార్థుల వివరాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదించాం. సికిల్ సెల్ సోకిన విద్యార్థులకు అందించాల్సిన చికిత్సలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. త్వరలోనే ప్రత్యేక వైద్య బృందాలు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – ప్రభాకర్‌రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ఉట్నూర్