breaking news
sv prasad
-
పదవులకు వన్నెతెచ్చిన అధికారి
ఐఏఎస్... మన దేశంలో యువత కలలు కనే ఉన్నతోద్యోగం. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బృహత్తర అవకాశం. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలని పరితపిస్తారు. అందులో కొద్దిమంది మాత్రమే యువ అధికారులకు స్ఫూర్తి ప్రదాతలుగా చరిత్ర పుటలకెక్కుతారు. అందులో ముందు వరసలో నిలిచే అధికారి ఎస్వీ ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన వ్యక్తిత్వం, కార్యదక్షత ఎనలేనివి. కోవిడ్‌వల్ల ఆయన మరణిం చడం దిగ్భ్రమ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సిగటపు వీర ప్రసాద్ (ఎస్వీ ప్రసాద్) 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అహ్మ దాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసుల వైపు మళ్లారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా కెరియర్ ప్రారంభించారు. 1982లో కడప కలెక్టర్‌గా, 1985లో విశాఖ పట్నం కలెక్టర్‌గా పనిచేశారు. చిన్న వయసులోనే విశాఖలో కమి షనర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేసిన ప్రసాద్ విశాఖ నగరాభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. 2009లో భూప రిపాలన ప్రధాన కమిషనరుగానూ విధులు నిర్వర్తించారు. ఏపీ జెన్కో చైర్మన్‌గా, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, వైఎస్ చైర్మన్‌గా బాధ్య తలు నిర్వర్తించారు. విద్యుత్తు సంస్కరణల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందంటే అది ఆయన చలవే. విద్యుత్తు రంగం అంటే ప్రసాద్‌కు మక్కువ. మానవ మనుగడకు, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన కరెంటును సరఫరా చేయడం విషయంలో నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఆయన సూచనలతో అధికార వర్గం చేపట్టిన సంస్కరణలను నాటి వాజ్ పేయి ప్రభుత్వంలోని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా కొనియాడారు. నిరంతరం చెరగని చిరునవ్వుతో పనిచేసే ఆయనకు అధికార వర్గాల్లో ‘జెంటిల్‌మేన్ బ్యూరో క్రాట్’ అనే పేరుంది. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరితోనూ ఒకే విధంగా వ్యవహరిస్తూ, ఓర్పుతో విధులు నిర్వర్తించేవారు. ఒక ఐఏఎస్ అధికారి సాధారణంగా ఒక ముఖ్యమంత్రి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేయడమే గొప్ప! కానీ, ఎస్వీ ప్రసాద్ ఏకంగా ముగ్గురు సీఎంలు– నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు దగ్గర సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొద్ది కాలం ఆయన పేషీలోనూ పనిచేశారు. సహజంగా సీఎం మారగానే ఆయన పేషీలోని అధికారులకు స్థాన చలనం కలుగుతుంది. కానీ, ప్రసాద్ మాత్రం నలుగురు సీఎంల పేషీల్లో దాదాపు 13 ఏళ్లు విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పనిచేయాలన్నది ప్రతి ఐఏఎస్ అధికారి కల. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వీస్ పోస్టు అయిన ప్రధాన కార్యదర్శి పదవిని ఎస్వీ ప్రసాద్ 2009లో దక్కించుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011 సెప్టెంబర్ చివరి వరకూ పనిచేశారు. ముఖ్య మంత్రులు తమకు ఇష్టమైన, సమర్థుడైన అధికారిని ఎంపిక చేసుకొంటారు. అది సాధారణ ప్రక్రియ. డజన్‌కు పైగా సీని యర్లను పక్కనపెట్టి మరీ నాటి ముఖ్యమంత్రి ప్రసాద్‌కు అవ కాశం ఇచ్చారు. అవి అక్షరాలా, ఆణిముత్యాలా! ఆయన వ్యక్తిత్వం లాగానే దస్తూరి కూడా అద్భుతమే. 2009 అక్టోబర్‌లో వరదలు వచ్చిన సమయంలో ఆయన సేవలు ఎనలేనివి. శ్రీశైలం జలాశయానికి శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఆయన కాలంతో పోటీపడి సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాల వల్లే శ్రీశైలం డ్యామ్ సురక్షితంగా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా జల ప్రళయమే. కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు నామరూపాల్లేకుండా పోయేవి. తెల్లవారుజామున 5 గంటలకు ఆయన దినచర్య మొదలై, అర్ధరాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగేది. చిరు ద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరు వచ్చినా ఓపిగ్గా మాట్లాడేవారు. ఎవరు ఫోన్ చేసినా స్పందించేవారు. ‘ఎవరైనా అవసరం ఉంటేనే కదా ఫోన్ చేస్తారు’ అనేవారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమ యంలో విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే బాలరాజును నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సీనియర్ ఐఏఎస్ అర్జునరావు, సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డిల సహకారంతో బాలరాజు కిడ్నాప్ కథ సుఖాంతం అవడంలో కీలకపాత్ర పోషించారు. తరచూ ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అనేవారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన సాయం చేస్తూనే ఉండాలని చెప్పేవారు. ఆయనలో మరో విశేష గుణం బాగా పనిచేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం. వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించేవారు. ఏ అధికారికైనా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి ఏ పార్టీ వారైనా సరే న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. ఐఏఎస్ అధికారిగా దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించినా ఎన్నడూ ఇసుమంతైనా గర్వం ప్రదర్శించలేదు. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రసాద్ సీసీఎల్ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా ఆయనకు ఏపీ జెన్కో ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నిబంధనలు ఉల్లంఘిం చకుండా తక్కువ ధరకు బొగ్గు కొనాలని వైఎస్ సూచించారు. ప్రసాద్ అందుకోసం డి. ప్రభాకర్ రావుతో కలిసి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని చూసి వైఎస్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ నివేదికను అమలు చేయడం వల్ల బొగ్గు కొనుగోళ్లలో దాదాపు రూ.1000 కోట్లు ఆదా అయింది. హైదరాబాదులోని ఓ అనాథా శ్రమంలోని పిల్లల చదువుల కోసం తన వేతనంలో కొంత భాగాన్ని మూడోకంటికి తెలియకుండా ఇచ్చేవారు. ఆయన మరణ వార్తకు మీడియా ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. ‘ఉమ్మడి ఏపీ పూర్వ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇక లేరు’ అంటూ ఆయన విశిష్టతను మరోసారి ప్రజలకు గుర్తుచేసింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న వారికి, రావాలని కోరుకునే వారికి ఆయన రోల్ మోడల్. ఎస్వీ ప్రసాద్, శ్రీలక్ష్మి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. విధి విచిత్రమో, దైవలీలో గానీ మరణంలోనూ వారి సాన్నిహిత్యం వీడలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వ్యాసకర్త: ఎ. చంద్రశేఖర రెడ్డి సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ -
హైదరాబాద్: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
-
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత: సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 2010లో ఉమ్మడి ఏపీలో సీఎస్‌గా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎస్వీ ప్రసాద్ విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎస్వీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్ తనదైన ముద్ర వేశారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సంతాపం: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతి: బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత -
ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రేపటి నుంచి మూడేళ్లపాటు పదవిలో ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో 4 దశాబ్దాలు సేవలందించిన ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొదటి విజిలెన్స్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బుధవారం నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్వీ ప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక హోదాల్లో పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రసాద్ ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదివారు. 1975లో అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. మొదట గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన ప్రతిభా పాటవాలను చూసి నలుగురు ముఖ్యమంత్రులు వారి పేషీల్లో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.జనార్దన్‌రెడ్డి, చంద్రబాబుల పేషీల్లో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీ జెన్కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. 2010లో తుపాను వచ్చిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శింగా ప్రసాద్ చూపిన చొరవను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
సినిమాలను టార్గెట్ చేయొద్దు
‘‘రాష్ట్రంలో ఏ ఆందోళన జరిగినా ఇతర వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఉద్యమాల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బాగా నష్టపోతున్నారు. సినిమాల నిర్మాణం కూడా తగ్గే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే ఎంతో మంది ఉపాధి కోల్పోతారు. ఉద్యమం దేనికోసం అయినా కానివ్వండి.. సినిమాని టార్గెట్ చేయకపోతే బాగుంటుంది’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ- ‘‘నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జా తీయ బాలల చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవి రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేవే అయినప్పటికీ సినీ సంఘాలన్నీ ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇక, చెన్నయ్‌లో జరగనున్న వందేళ్ల సినిమా వేడుక విషయానికొస్తే.. ఆ వేడుకలో పాల్గొనాలా, వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి’’ అని చెప్పారు. చిన్న సినిమాల గురించి చెబుతూ- ‘‘ధియేటర్లలో ఐదో ఆటకు అనుమతించి, ఒక ఆట చిన్న సినిమాకి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. అలాగే చిన్న సినిమాలను 150 స్క్రీన్లకు పెంచాలని కోరాం. వీటికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోంది. ఇంకా జీవో రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు ఎన్వీ ప్రసాద్.