breaking news
Sri Kshetra Bhimashankar Temple
-
పోటెత్తిన భక్తజనం
పింప్రి, న్యూస్‌లైన్ : వేకువ జామునుంచే భక్తుల కోలాహలం మొదలయ్యింది. శ్రీ క్షేత్ర భీమా శంకర ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడంతో శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఒక్క సోమవారం రోజునే సుమారు 2 లక్షల మందికిపైగా భక్తులు తరలి వచ్చారని, ఇంత మంది తరలిరావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం దర్శనానికి వీలుగా ప్రత్యేక బారికేడ్లను, పందిర్లను ఏర్పాటు చేశారు. భక్తులు వర్షంలో ఇబ్బందులు పడకుండా ప్లాస్టిక్ పందిర్లు ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ప్రశాంత్ ఆవట్, ఆంబేగావ్ తహసిల్దార్ బి.జే.గోరే పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఉదయాన్నే డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తిగా మందిరం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. గర్భ మందిరం, మందిర పరిసరాలను దేవస్థాన భద్రతా సిబ్బంది, పోలీసులు తమ అధీనంలో ఉంచుకొని భక్తులను దర్శనానికి తరలించారు. దేవస్థాన ఉపకార్యనిర్వాహణాధికారి(ఈఓ) అధికారి సురేష్ కోడరే, ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, పోలీసు అధికారులు సంజయ్ కామర్పాటిల్, కీర్తీ జమదాడే, వైద్యాధికారి డాక్టర్ సారికా కాంబ్లే తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్తంభించిన ట్రాఫిక్ చాలా వరకు భక్తులు తమ సొంత వాహనాలల్లో తరలిరావడంతో కి.లో మీటరు పొడవున ట్రాఫిక్ స్తంభించి పోయింది. మాతార్వాడి నుంచి అటవీ విభాగం చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రత్యేక బస్సులు : శివాజీ నగర్, రాజ్‌గురునగర్, నారాయణ్ గావ్, స్వార్గేట్తోపాటు ఇతర బస్సు డిపోల నుంచి అధిక బస్సు సర్వీసులను ఆలయానికి నడుపుతున్నారు. ఆలయప్రాంగణంలో పలు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశాయి. -
శ్రావణ మాసానికి సర్వం సిద్ధం
పింప్రి, న్యూస్‌లైన్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీక్షేత్ర భీమశంకర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏటా ఈ క్షేత్రం శ్రావణమాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, పచ్చటి తోరణాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలను కూడా పెంచినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నేటి నుంచి శ్రావణయాత్ర.. శ్రావణమాసంలో వచ్చే తొలి సోమవారమైన నేటి శ్రావణ యాత్ర ప్రారంభంకానుంది. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, ఇతర సదుపాయాలను కూడా పూర్తి చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సేవలను కూడా ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నారాయణ్ గావ్ విభాగానికి చెందిన అశోక్ హండే తెలిపారు. 25 మంది పోలీసు ఉన్నతాధికారులు, 200 మంది సీనియర్ అధికారులతోపాటు పెద్దమొత్తంలో సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నార ని పోలీస్ అధికారి గిరీష్ దీగావ్కర్ తెలిపారు. యాత్ర ఏర్పాట్లను ఆంబేగావ్ ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, సునీల్ తోఖే, ఖేడ్ ప్రాంతీయ అధికారి హిమాంత్ ఖరాడే, జున్నర్ తహశీల్దారు ప్రశాంత్ అవట్, అటవీ సంరక్షణ సహాయ అధికారి కీర్తి జయదోడే, భవన నిర్మాణ విభాగ అధికారి ఎ.బి.దేవడే, ప్రాంతీయ నగరాభివృద్ధి అధికారులు రత్నాకర్, సురేష్, విద్యుత్ మండలి అధికారి ఎస్.ఎస్.గీతే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.