breaking news
slaughter of animals
-
గోవధ జరగకుండా పటిష్ట చర్యలు
సాక్షి, గుంటూరు: గుంటూరు రేంజ్ పరిధిలో బక్రీద్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని గోవధ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నేపాల్, భారత్ అంతర్జాతీయ గోరక్షా అభియాన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ హిందువులకు గోమాత అంటే ఎనలేని భక్తి అన్నారు. వారి భక్తిని గౌరవించి ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలని కోరారు. మతాలు వేరైనా అందరం ఒక్కటే అని జీవించే ఏకైక దేశం మనది కావడంతో అందరం గర్వించాల్సిన విషయమని చెప్పారు. గోవధ జరగకుండా ముస్లింలు సహకరించాలన్నారు. అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పాత గుంటూరులో అక్రమంగా ఉంచిన 50 గోవులను గుర్తించి వాటిని గోరక్షణ కేంద్రానికి తరలించామని తెలిపారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ కోరామన్నారు. -
పింక్ టెర్రరిజం.. సరికొత్త ఉగ్రవాదం!
ఇప్పటివరకు రకరకాల ఉగ్రవాదాలు చూశాం. కానీ ఇప్పుడో సరికొత్త ఉగ్రవాదం వస్తోందట. అక్రమంగా జంతువులను వధిస్తూ, వాటితో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి కొంతమంది ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు. దానికి ఆమె 'పింక్ టెర్రరిజం' అని పేరుపెట్టారు. పాలిచ్చే జంతువులను వధించడం భారతదేశంలో ఒక వ్యాపారంగా ఉందని, దీంతో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నప్పుడు, దీన్నెందుకు అనుమతిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. చైనాలో కంటే ఎక్కువగా భారతదేశంలో జంతువులను వధిస్తున్నారని, పాలిచ్చే జంతువులను ఇలా అక్రమంగా వధిస్తూ, వాటిని బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. ఇందులో మతం ప్రసక్తి ఏమాత్రం లేదని, కేవలం డబ్బుకోసమే అంతా ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎప్పటినుంచో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న మేనకా గాంధీ, తాజాగా ఇండియా ఫర్ యానిమల్స్ అనే సదస్సులో మాట్లాడుతూ ఈ గులాబీ ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నాలుగేళ్ల క్రితమే దీనిగురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ఒక్క దేశానికే మన వద్ద నుంచి అక్రమంగా ఏటా 1.60 లక్షల టన్నుల ఆవుమాంసం పంపుతున్నామని, వాళ్లకు ఒక్క ఆవు కూడా లేదని ఆమె అన్నారు. ఇలా, పాలిచ్చే జంతువులను వధించడం.. దానికితోడు ఆ డబ్బును ఉగ్రవాదానికి ఉపయోగించడం విశృంఖలంగా సాగుతున్నందున.. దీన్ని అడ్డుకోడానికి అందరూ కృషిచేయాలని, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మేనక పిలుపునిచ్చారు.