breaking news
s.janaki
-
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్‌కు దిగారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఏడవలేదంటూ కొందరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు అప్సర సోషల్ మీడియా వేదికగా అత్యంత హుందాగా, ఎమోషనల్‌గా సమాధానమిచ్చారు.కంటికి కనిపించని కన్నీళ్లతో మా బాధను కొలవొద్దు‘మనకు ఇష్టమైన మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కేవలం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి, మనసును మెలిపెడుతూనే ఉంటుంది. దయచేసి కంటికి కనిపించని కన్నీళ్లతో మా గుండెల్లోని బాధను ముడిపెట్టొద్దు’ అంటూ అప్సర ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదుఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’ అని అప్సర తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అప్సర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుఃఖాన్ని ప్రదర్శించే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని, కష్ట సమయంలో ఉన్న ఒక కుటుంబంపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరికాదంటూ నెటిజన్లు అప్సరకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
జానకమ్మ పాడిన 48 వేల పాటల్లో అత్యంత కష్టమైన సాంగ్ ఇదే!
తన గాత్రంలో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దిగ్గజ గాయని, 'దక్షిణ భారత నైటింగేల్' ఎస్. జానకి (88) ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు ఆమె.లాలిపాటలు, జానపదాలు, క్లాసికల్, మెలోడీలు.. ఇలా ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. అయితే, ఇన్ని వేల పాటలు పాడిన జానకమ్మకు తన కెరీర్లో అత్యంత సవాలుగా నిలిచిన ఒక పాట ఉందన్న విషయం మీకు తెలుసా?గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానకి గారు స్వయంగా తనకు అత్యంత కష్టమైన పాట గురించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం 'హేమవతి'లోని 'శివ శివ ఎన్నడ నలికే ఏకే' అనే పాట తాను పాడిన అన్ని పాటలలోకెల్లా అత్యంత కష్టమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ పాటను అంత క్లిష్టంగా మార్చింది ఆ పాట యొక్క స్వరకల్పనే. సంగీత దర్శకుడు ఈ పాటలోని ప్రతి రెండో చరణంలో 'తోడి', 'అపోకి' అనే రెండు వేర్వేరు రాగాలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా అద్భుతంగా, అంతే క్లిష్టంగా స్వరపరిచారు.పాడేటప్పుడు రాగాలలో వచ్చే ఈ అత్యంత సూక్ష్మమైన మార్పులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఏ మాత్రం శృతి తప్పినా పాట గాడి తప్పుతుంది. అందుకే, క్లాసికల్ సంగీతంలో ఎంతో పట్టున్న ఎస్. జానకి సైతం, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఈ పాటను అత్యంత సవాలుతో కూడుకున్న పాటగా అభివర్ణించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె పాడిన ఇలాంటి అపురూపమైన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. -
చాలా మిస్ అవుతున్నాను.. త్రిష ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) మరణంతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్న తరుణంలో, ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సందేశం అభిమానులను ఎంతగానో కదిలిస్తోంది. తన బ్లాక్‌బస్టర్ చిత్రం '96' షూటింగ్ సమయంలో ఎస్. జానకితో కలిసి దిగిన అరుదైన ఫోటోని త్రిష ఈ సందర్భంగా పంచుకున్నారు.జానకమ్మను స్మరిస్తూ ఎమోషనల్ పోస్ట్సోషల్ మీడియా వేదికగా జనకమ్మకు నివాళులులర్పించారు త్రిష. ‘నా కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకదానికి మీ పేరు (జాను) పెట్టడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. మీతో వ్యక్తిగత పరిచయం ఏర్పడటం, మీ అమూల్యమైన ప్రేమను పొందడం నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. మీ ఆప్యాయత, దయ, మరువలేని చిరునవ్వుకు ధన్యవాదాలు. ఎంతటి గొప్ప కళాకారులైనా ఎంత వినయంగా ఉండాలో మీరే నిరూపించారు. మీ గాత్రం అమరమైనది, అది ఎప్పటికీ మన మధ్యే ఉంటుంది. జానకి అమ్మా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ..ఆమెతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసింది.'96' సినిమాలో జానకమ్మచాలా మంది అభిమానులకు తెలియని విషయం ఏమిటంటే, విజయ్ సేతుపతి, త్రిష నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ '96' చిత్రంలో ఎస్. జానకి ఒక ప్రత్యేకమైన సీన్లో నటించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమెపై ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ, చిత్ర నిడివి ఎక్కువైపోవడంతో ఆ సీన్‌ను ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డిలీటెడ్ సీన్ ఇంటర్నెట్లో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
నా తొలి పాటే బాలూ గారితోపాడాను!
శ్రావ్యమైన గానం, శుద్ధమైన గాత్రం.. వెరసి మాళవిక. యుగళగీతం, విరహగీతం, భక్తిగీతం, ఫాస్ట్ బీట్.. ఇలా ఏ తరహా గీతానికయినా సరే... తన గానంతో ప్రాణం పోయగల దిట్ట తను. పదకొండేళ్ల సినీ సంగీత ప్రయాణంలో ఎన్నో మంచి పాటలు పాడి, తెలుగు శ్రోతల మనసుల్ని గెలిచిన ఈ యువగాయనితో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఈ సంగీత ప్రయాణం ఎలా ఉంది? చాలా బావుందండీ... నాకే కాదు, నా తోటి సింగర్స్‌కు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తోంది. గతంతో పోలిస్తే... మీ తరానికి కాస్త పోటీ ఎక్కువే కదా! అవును. అప్పట్లో తక్కువ మంది సింగర్లు ఉండేవారు. అందుకే వారికి ఎక్కువ పాటలు పాడే అవకాశం దక్కింది. మాకు ఆ పరిస్థితి లేదు. అయితే... అందరికీ పాడే అవకాశాలు లభించడం మాత్రం ఆనందంగా ఉంది. ఏ రంగంలోనైనా కొంత మంచి, కొంత చెడు సహజమే కదా! మీ తోటి సింగర్లలో మీకు నచ్చిన వాళ్లెవరు? అందరూ మంచి సింగర్లే. ఎవరికుండే ప్రత్యేకతలు వారివే. సరే.. గాయనిగా మీకు ప్రేరణ? ఎస్.జానకిగారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రభావం కూడా నాపై ఉంటుంది. క్లాసికల్ నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. డీవీ మోహనకృష్ణగారు నా గురువు. ఇప్పటికే బి.ఏ మ్యూజిక్ చేశాను. ఇక వెస్ట్రన్ మ్యూజిక్ విషయానికొస్తే... ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో 6వ గ్రేడ్ చేశాను. నాకు తొలి గురువు మా అమ్మే. మా అమ్మ మ్యూజిక్ టీచర్. చాలామంది మా ఇంట్లోనే సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అలా చిన్నప్పట్నుంచీ సంగీతం నా జీవితంలో భాగమైపోయింది. అమ్మ దగ్గరే బేసిక్స్ నేర్చుకున్నా. మీ స్వస్థలం ఎక్కడ? విశాఖపట్నం.. అక్కడే పెరిగాను. నాన్న రిటైర్డ్ సివిల్ ఇంజినీర్. 6వ తరగతి చదువుతున్నప్పుడే... ‘పాడుతా తీయగా’ చిల్డ్రన్స్ సిరీస్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాను. మరి సినీగాయనిగా ఎలా మారారు? సంగీత దర్శకుడు ఆశీర్వాద్గారు ‘రాక్‌ఫోర్డ్’ అనే ఆంగ్ల చిత్రానికి నాతో ఓ ఇంగ్లిష్ పాట పాడించారు. తర్వాత ఆయనే... ‘బాలీవుడ్ కాలింగ్’ అనే హిందీ చిత్రానికి హిందీ పాట పాడించారు. శంకర్‌మహదేవన్ గారితో కలిసి ఆ పాట పాడాను. ఆ రెండు ఆల్బమ్స్నీ కీరవాణిగారు విన్నారు. ఆయనకు నచ్చి నాకు ‘గంగోత్రి’ (2003) సినిమాకు పాడే అవకాశం ఇచ్చారు. ‘నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం’ నేను పాడిన తొలి తెలుగు సినిమా పాట. తొలిపాటకే గొప్ప స్పందన లభించింది. ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే. పన్నెండేళ్ల ప్రాయంలో ‘పాడుతా తీయగా’ విజేత అయినప్పుడు బాలూగారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అలాంటి మీరు.. తొలి పాటే బాలూగారితో పాడటం ఎలా అనిపించింది? అది డ్యూయెట్ అని తెలుసుకానీ... నాతో పాడేది బాలు గారని తెలీదు. పైగా ఇదివరకులా కలిసి పాడనవసరం లేదు కదా. ఎవరి ట్రాక్ వారు పాడేసుకోవడమే. పాటంతా విన్నాక కానీ నాకు తెలీలేదు... మేల్ సింగర్ బాలూగారని. బాలూగారు కూడా నన్నెంతో మెచ్చుకున్నారు. ఇప్పటికి ఎన్ని అవార్డులు అందుకున్నారు? ప్రైవేటు అవార్డులు చాలా వచ్చాయి. నంది అవార్డులు మాత్రం రెండు అందుకున్నాను. ఒకటి టీవీ రంగం నుంచి వస్తే, రెండోది సినీరంగం నుంచి వచ్చింది. ‘మేలుకొలుపు’ అనే బుల్లితెర కార్యక్రమానికి మాధవపెద్ది సురేశ్‌గారి స్వర రచనలో ఓ పాట పాడాను. దానికి నంది రాగా, రెండో నంది... ‘రాజన్న’ సినిమాకు గాను నేను పాడిన ‘అమ్మా అవనీ..’ పాటకు లభించింది. మీకు బాగా పేరు తెచ్చిన పాటలు? ‘గంగోత్రి’లో ‘నువ్వు నేను...’, ‘బిల్లా’లో ‘బొమ్మాలీ...’, ‘ఏక్‌నిరంజన్’లో ‘ఎవరూ లేరని అనకు’, ‘ప్రేమకథాచిత్రమ్’లో ‘వెన్నెలైనా చీకటైనా’, ‘వరుడు’లో ‘అయిదు రోజుల పెళ్లి’... ఇలా చాలా ఉన్నాయి. మీరు బాగా కష్టపడి పాడిన పాట? ‘అమ్మా అవనీ...’. ఆ పాట సందర్భం సినిమాకు చాలా కీలకం. ఎంతో ఫీలై పాడాల్సిన పాట. అందుకే జాగ్రత్తలు తీసుకొని పాడా. సంగీత దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? లేదండీ... సంగీత దర్శకులందరి స్వరరచనలో పాడాలని ఉంది. వారి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి రాగలిగాను. నిజంగా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఎన్నేళ్లు గడిచినా గుర్తుండిపోయే పాటలు పాడాలని ఉంది. నా లక్ష్యం అదే.


