Simplification Terms
-
కొత్త ఐటీ చట్టం రెడీ!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఇక కొత్త ఆదాయపన్ను (ఐటీ) చట్టం అమల్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం–2025 నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం నోటిఫై చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు–2026గా వ్యవహరించే ఈ కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్ విషయంలో భారీ ఊరటతో పాటు హెచ్ ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని మధ్య సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించడం వరకు అనేక మార్పులు కొత్త చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అనవసర సెక్షన్లు తొలగింపు... పాత ఆదాయపన్ను చట్టం–1961 స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టానికి 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను రేట్ల ప్రతిపాదనల వంటివేవీ ఇందులో లేనప్పటికీ ఆరు దశాబ్దాల నాటి సంక్లిష్టమైన పాత చట్టాన్ని మరింత సరళమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. 1961 నాటి ఐటీ చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536కు కుదించడంతో పాటు చాప్టర్ల సంఖ్యను కూడా 47 నుంచి 23కు తగ్గించారు. అలాగే చట్టంలోని మొత్తం పదాలను 5.12 లక్షల నుంచి సగానికి అంటే 2.6 లక్షల పదాలకు తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా మరింత మెరుగైన స్పష్టత కోసం 39 కొత్త టేబుల్స్, 40 కొత్త ఫార్ములాలను కూడా కొత్త చట్టంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాన్ వెసులుబాటు.. బ్యాంకుల్లో నగదు డిపాజిట్/ఉపసంహరణ నుంచి కొత్త వాహనాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు, హోటల్ బిల్స్ చెల్లింపు దాకా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వెల్లడికి సంబంధించి లావాదేవీల పరిమితి భారీగా పెరుగుతుంది. బ్యాంకుల్లో ఇప్పుడు రూ.50,000కు మించి నగదు డిపాజిట్‌కు పాన్ కాపీ తప్పనిసరి నిబంధన ఉంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే (ఒకటి లేదా మరిన్ని ఖాతాలకు) పాన్ ఇస్తే సరిపోతుంది. ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే (ప్రస్తుతం రూ.10 లక్షలు) పాన్ సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుంది. అలాగే, ఏ వాహన కొనుగోలుకైనా విలువ రూ.5 లక్షలకు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు రూ. లక్షకు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు మించితేనే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.ఇతర ముఖ్యాంశాలివీ..→ ఇంటి అద్దెపై ఐటీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని సంబంధాన్ని వెల్ల డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. → ఇకపై ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు.. ఈ ఎనిమిది నగరాలు 50% హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి జాబితాలోకి రానున్నాయి. మిగతా చోట్ల 40% పరిమితి కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలో వేతన జీవులకు మాత్రమే 50% నిబంధన వర్తిస్తోంది. → షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికెట్ల వంటి కన్వర్టెడ్ సెక్యూరిటీలకు సంబంధించి నిర్దిష్ట కేసుల్లో మూలధన లాభాలు స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ణయించడానికి హోల్డింగ్ వ్యవధి లెక్కింపుపై మరింత స్పష్టత. మార్పిడికి ముందు అవి ఎంత కాలం పాటు ఉన్నాయనే దాన్ని కూడా హోల్డింగ్ పీరియడ్‌లో చేర్చుతారు. → పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. సులభతర పత్రాలు, ఆదాయపన్ను శాఖ వద్దకు చేరిన సమాచారం ముందుగానే ఆయా పత్రాల్లో నింపి ఉంటుంది. → యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే ప్రో త్సాహకాల విషయంలోనూ పన్ను మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి. → క్రిప్టో ఎక్సే్చంజీలు ఐటీ శాఖతో సమాచారం పంచుకోవడం ఇకపై తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) సైతం ఆమోదనీయమైన ఎల్రక్టానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
సెజ్‌ల నిబంధనల సరళతరంపై కసరత్తు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం.. మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. -
వ్యాపార నిబంధనల సరళీకరణపై దృష్టిపెట్టండి
ప్రభుత్వానికి నాస్కామ్ సూచన న్యూఢిల్లీ: ‘వ్యాపారాన్ని ప్రారంభించేందుకు భారత్‌లో ఉన్న నిబంధనల సరళీకరణపై ప్రభుత్వం దృష్టిసారించాలి. మంచి ఊపు మీదున్న స్టార్టప్ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నంపై కాదు’ అని నాస్కామ్ సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నా, పలు అనుమతులు, క్లియరెన్సులు వ్యాపారాల ప్రారంభానికి ఆటంకంగా ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. భారత్‌లో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘చక్కని వ్యాపార ఆలోచనలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య కంటే పెట్టుబడి చేయదగ్గ డబ్బే అధికంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా నగదు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీల్లో పెట్టుబడి చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార ప్రారంభం, నిబంధనల అమలు భారం, మూసివేతలో ఇబ్బందులు పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి’ అని వివరించారు. ఆ చర్చే లేదిక్కడ..: వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది అన్న అంశంపై పలు దేశాలు పోటీపడుతున్నాయి. అసలు భారత్‌లో ఆ చర్చే లేదని చంద్రశేఖర్ అన్నారు. ‘3-4 ఉద్యోగులతో కొత్త వ్యాపారం ఏర్పాటుకు పారిశ్రామికవేత్త 50-60 అనుమతులు, క్లియరెన్సులు వివిధ శాఖల నుంచి తీసుకోవాల్సి వస్తోంది. సులభతర నిబంధనలు తీసుకురావడం చాలా సులువు. నిబంధనలు వద్దని నేను చెప్పడం లేదు. టెక్నాలజీ స్టార్టప్స్ వంటి కొన్ని రంగాల కంపెనీలకు ఇన్ని అనుమతులు, క్లియరెన్సులు అవసరం లేదు. స్టార్టప్‌ల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలను ఒకే పరిధి కిందకు తెచ్చే పథకాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు.


