breaking news
Shyam Sunder Reddy
-
కాటేస్తున్న కలుపు మందు!
* గ్లైఫొసేట్ పిచికారీలో తప్పిదాలు.. నాశనమవుతున్న ఉద్యాన తోటలు.. నష్టపోతున్న రైతులు * కళతప్పిన తోటలకు జీవామృతం, మల్చింగ్ పద్ధతులతో పునరుజ్జీవనం * డాక్టర్ శ్యామసుందర్‌రెడ్డి సుదీర్ఘ క్షేత్రస్థాయి పరిశోధనలో వెల్లడైన ఆశ్చర్యకరమైన నిజాలు రైతులకు నిలకడగా, గణనీయమైన ఆదాయాన్నిస్తూ దీర్ఘకాలం మనగలిగిన పంట బత్తాయి. కానీ నేడు బత్తాయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. చేతికొచ్చిన చెట్లు నిలువునా ఎండిపోతుండడంతో ఏటా వేల ఎకరాల్లో బత్తాయి తోటలు తీసేస్తున్నారు. కర్ణుడి చావు లాగా దీనికీ కారణాలు అనేకం. అనుకూలం కాని నేలలు, నాణ్యత లేని అంటు మొక్కలు, అసంపూర్ణమైన నీటి యాజమాన్యం.. వెరసి వివిధ రకాల తెగుళ్లు. అయితే.. బొత్తిగా ఈ సమస్యలేవీ లేని బత్తాయి తోటలు కూడా కళతప్పి.. నిలువునా ఎండిపోతున్నాయి. రైతుల పచ్చని కలల సౌధాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయి.. ఎందుకని?? ఈ వ్యథకు మూల కారణం.. గ్లైఫొసేట్ అనే ఒక కలుపు మందు! నిజానికి ఇక్కడ సమస్య మందు కాదు.. దాన్ని వాడే విధానం అంటే ఆశ్చర్యం కలగక మానదు! కానీ, ఇది ముమ్మాటికీ నిజం. హైదరాబాద్‌లోని ఐఐఐటీకి చెందిన ‘ప్లాంట్ డాక్టర్’ డా. గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి ఆరు జిల్లాల్లోని బత్తాయి రైతులతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నాలుగేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. సమస్య మూలాన్ని గుర్తించడంతోపాటు.. ప్రభావశీలమైన రసాయన రహిత పరిష్కార మార్గాలను కూడా అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. ఇవీ ఆయన పరిశోధనలో వెలుగుచూసిన ముఖ్యాంశాలు.. గ్లైఫోసేట్ ప్రభావానికి గురైన చెట్లు కళ తప్పి ఉంటాయి. నేలలో తగినంత తేమ ఉన్నప్పటికీ బెట్టకు వచ్చినట్లు కన్పిస్తాయి. సూక్ష్మ పోషక లోపాలను అధికంగా కలిగి ఉంటాయి. తెగుళ్లను తట్టుకునే శక్తిని కోల్పోవడం వల్ల బంక కారడం, వేరుకుళ్లు తెగులు ఉధృతి పెరుగుతుంది. గ్లైఫోసేట్ ప్రభావం చిటారు కొమ్మలపై అధికంగా ఉండడం వల్ల ఎండుపుల్ల ఎక్కువగా వస్తుంది. కాయలున్న కొమ్మలు కూడా బలహీనంగా ఉండడం వల్ల కాయల సైజు అంతంత మాత్రంగానే ఉండి, త్వరగా లేత పసుపు రంగుకు మారిపోతాయి. చాలా సందర్భాల్లో వడప లేదా బొడ్డుకుళ్లు తెగులు సోకి కాయలు రాలిపోతాయి. కొన్ని సందర్భాల్లో పుల్ల ఎండడం వల్ల వాటికి ఉన్న కాయలు కూడా ఎండిపోతాయి. ‘జీవామృతం’ ఒక అద్భుత పరిష్కారం! గ్లైఫోసేట్ వల్ల దెబ్బతిన్న తోటల్లో జీవామృతంతో చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. జీవామృతాన్ని 1:4 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల కొకసారి పిచికారీ చేయాలి. చెట్టుతో సహా పాదు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. ఇలా కనీసం ఐదుసార్లు పిచికారీ చేసిన తోటలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారాయి. 120 నుంచి 150 గ్రాముల బరువున్న బత్తాయిలు తిరిగి ఆకుపచ్చ రంగులోకి మారి 200 నుంచి 250 గ్రాముల బరువుకు పెరిగాయి. ఎండిన కొమ్మలకు ఆరోగ్యవంతమైన చిగుళ్లొచ్చాయి. చుట్టుపక్కల చాలా తోటల్లో వడప తెగులు సోకి కాయలు గణనీయంగా రాలిపోయినా.. జీవామృతం పిచికారీ చేసిన తోటలో మాత్రం రాలిన కాయలు అతి తక్కువ. మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి గ్రామానికి చెందిన అజయ్ కుమార్‌రెడ్డి(96663 93070) తోటలో మోడుబారిన కొమ్మలకు సైతం ఆరోగ్యవంతమైన కాయలు కాస్తుండడం నిజంగా ఒక అద్భుతాన్నే తలపించింది. ఇదీ సమస్యకు మూలం.. గ్లైఫోసేట్ అత్యంత ప్రభావశీలి అయిన కలుపునాశిని. గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిన కూలీల ఖర్చులు, కూలీల కొరత కారణంగా బత్తాయి తోటల్లో ఈ గడ్డి మందు వాడకం కూడా బాగా పెరిగింది. ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న తోటల్లో, అధిక సాంద్రత గల తోటల్లో చెట్లు కమ్ముకోవడంతో యంత్రాలతో అంతరకృషి చేయడం కష్టం. కాబట్టి గడ్డి మందు వాడకం తప్పనిసరైంది. గ్లైఫోసేట్ అంతర్వాహక చర్య కలిగినది. అంటే ఈ మందు చెట్టు లేదా మొక్క మీద ఏ భాగంలో పడినా సరే.. క్షణాల్లో వేర్లతో సహా చెట్టు అంతా వ్యాపిస్తుంది. ఇది అన్ని రకాల మొక్కలకూ హానికరమైనది. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు... అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకుంటుంది. చెట్టుకు అవసరమైన జింకు, ఇనుము, రాగి తదితర లోహపు అయానులను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా చెట్టు చివరి భాగాల నుంచి ఎండిపోతూ కొన్ని రోజులకు పూర్తిగా చనిపోతుంది. ఇటీవలి కాలంలో ఈ కలుపు మందు పిచికారీ కోసం తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ లేదా డీజిల్/పెట్రోల్ పంపులకు అమర్చిన స్ప్రేయర్ల వాడకం సర్వసాధారణమై పోయింది. ఈ స్ప్రేయర్లు అధిక ఒత్తిడిని కలిగి ఉండడం వల్ల ఎక్కువ తుంపరను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల మందు కలుపు మొక్కలతో పాటు బత్తాయి చెట్లపైన కూడా పడే అవకాశం చాలా ఎక్కువ. దీనికి గాలి తోడయితే ఇక చెప్పనవసరం లేదు. గడ్డి మందును కావాలనే బత్తాయి మొక్కలపై పిచికారీ చేసినట్లే ఉంటుంది పరిస్థితి. కొంతమంది రైతులు పాదుల్లో కూడా గడ్డి మందును పిచికారీ చేస్తున్నారు. మొదళ్లపై గాయాలున్న చెట్లకు ఇది అత్యంత ప్రమాదకరం. మరి కొంతమంది రైతులు మరింత వేగవంతమైన కలుపు నివారణకు 2, 4-డి కలుపు మందును కూడా గ్లైఫోసేట్‌తో కలిపి పిచికారీ చేస్తున్నారు (దీన్ని ఇంతవరకు ఎవరూ సిఫార్సు చేసిన దాఖలాల్లేవు). మల్చింగ్ ద్వారా కలుపునకు చెక్! వరి కోత తర్వాత గడ్డిని కాల్చివేయడం కన్నా ఉద్యాన పంటల్లో మల్చింగ్ చేయడం చాలా ఉపయోగకరం. గడ్డిని ఏరి కట్టలు కట్టే యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. - వేరుశనగ పొట్టు, ఆముదం పొట్టును కూడా మల్చింగ్‌కు వాడవచ్చు. చెరకు సాగు అధికంగా ఉన్న చోట చెరకు ఆకు, వాడి పారేసిన లేత కొబ్బరి బోండాలను పీచుగా మార్చి (ష్రెడ్డింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి) మల్చింగ్ చేయవచ్చు. - పొలం అంతటా మల్చింగ్ చేయనక్కర్లేదు. చెట్ల పాదుల్లో మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల అగ్ని ప్రమాదాల బెడద ఉండదు. - చెట్ల మధ్య ఉన్న సాళ్లలో బ్రష్ కట్టర్ వంటి పరికరం ద్వారా కలుపును నేలకు 3-4 ఇంచుల ఎత్తులో కత్తిరించవచ్చు. ఈ పని చేస్తే నేలను దున్నక్కర్లేదు లేదా అసలు తవ్వకుండా ఉండొచ్చు. అలా కుదరనప్పుడు చెట్ల మధ్యలో రోటోవేటర్ లేదా గుంటుక వంటి యంత్రాల సహాయంతో కలుపును నివారించాలి. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్ల మధ్య కల్టివేటర్ లేదా డిస్క్ నాగళ్లతో దున్నడం అంత మంచిది కాదు. - మల్చింగ్ చేయడానికి కావాల్సిన గడ్డి దొరక్కపోయినా లేదా ఖరీదు అనిపించినా వర్షాకాలంలో జనుము, జీలుగ, జొన్న, సజ్జ వంటి అంతరపంటలు సాగు చేసి, నిర్ణీత సమయంలో వాటిని కత్తిరించి, పాదుల్లో మల్చింగ్ చేయాలి. వర్షాకాలంలో రెండుసార్లు ఇలా చేయవచ్చు. - నీటి వసతి ఉన్న చోట కొంత భూమిని కేవలం పచ్చిరొట్ట పైర్ల సాగుకు కేటాయించి, క్రమం తప్పకుండా కత్తిరించి మల్చింగ్ చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి. - అన్నిటి కన్నా సులువైనది... పాదుల్లో, సాళ్ల మధ్య పెరిగిన కలుపును పూర్తిగా పీకేసి దట్టంగా(12-15 ఇంచుల మందం) మల్చింగ్ చేయాలి. పలచగా వేస్తే పాదుల్లో కలుపు పెరుగుతుంది. దట్టంగా వేయడం వల్ల కింది వరుసల్లో ఉన్న కలుపు కుళ్లిపోతుంది. పైవరుసల్లో ఉన్నది ఎండిపోతుంది. దట్టంగా ఉన్న మల్చింగ్ కింద మొలిచిన కలుపు గింజలు పైకి రాలేక చనిపోతాయి. - ఈ పద్ధతిలో గింజల ద్వారా లేదా శాఖీయ పద్ధతిలో మొలకెత్తే కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి కలుపు మీద వరిగడ్డి, వరిపొట్టు, చెరకు ఆకు, వేప, గానుగ వంటి చెట్ల ఆకులను ఒక చిక్కటి పొరగా వేస్తే పాదుల్లో కలుపును సమర్థ్ధవంతంగా నివారించవచ్చు. - మహబూబ్‌నగర్ జిల్లా రాయికోడ్‌కు చెందిన బత్తాయి రైతు శ్రీనివాసరెడ్డి(77024 05400) రోటోవేటర్, బ్రష్ కట్టర్ ద్వారా కలుపు సమస్యను పూర్తిగా జయిస్తున్నారు. గ్లైఫోసేట్ అనివార్యమైతే..? మల్చింగ్ చేయని తోటల్లో విధిలేని పరిస్థితుల్లో గ్లైఫోసేట్ వాడాల్సి వస్తే కింది జాగ్రత్తలు తీసుకోవాలి: - న్యాప్పాక్/హ్యాండ్ స్ప్రేయర్ సహాయంతో నాజిల్‌కు హుడ్ను అమర్చి గాలి నిలకడగా ఉన్న సమయంలో మాత్రమే గ్లైఫోసేట్ను పిచికారీ చేయాలి. - ఎట్టి పరిస్థితుల్లోనూ మందు తుంపరలు బత్తాయి కొమ్మలు/ఆకులపై పడకూడదు. రంగపూర్ నిమ్మపై కట్టిన తీగ అంట్లు, నేలకు వాలిన కొమ్మలను కత్తిరించని తోటల్లో.. అధిక సాంద్రతలో మొక్కలను కలిగిన తోటల్లో జాగరూకత చాలా అవసరం. - గ్లైఫోసేట్ వద్దనుకుంటే పారాక్వాట్ డైక్లోరైడ్‌ను వాడవచ్చు. కానీ ఇది తుంగను, వయ్యారిభామను సమర్థవంతంగా నివారించలేదు. పైగా ఆకులపై, కాయలపై పడితే కాలిన మచ్చలు ఏర్పడతాయి. - గ్లైఫోసేట్ను పిచికారీ చేసిన 3 నుంచి 5 రోజుల లోపు జీవామృతాన్ని లేదా అమైనో ఆమ్లాలతో కూడిన సూక్ష్మ పోషక మిశ్రమాన్ని బత్తాయి చెట్లపై పిచికారీ చేస్తే వాటికి ఉపశమనం లభిస్తుంది. - పాదుల్లో కూడా గ్లైఫోసేట్ను పిచికారీ చేయాల్సి వస్తే ఆవుపేడ, పుట్టమట్టిని రెండు సమాన భాగాలుగా తీసుకొని తగినంత నీరు కలిపి పేస్టు మాదిరిగా చేసి కాండానికి ఒక మీటరు ఎత్తు వరకు పూత పూయాలి. ఈ పేస్టును తయారు చేసేటప్పుడు కాస్త గోమూత్రాన్ని కూడా కలిపితే మంచి ఫలితం ఉంటుంది. గ్లైఫోసేట్ను ఈ పొర విరగగొట్టి, గాయాల ద్వారా కాండం లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. - తోట పూత, పిందె మీద ఉన్నప్పుడు, తోటను బెట్టకు విడిచిన సమయాల్లో తప్ప- జీవామృతాన్ని క్రమం తప్పకుండా చెట్లు, పాదులు తడిసేలా పిచికారీ చేయాలి. - మహబూబ్‌నగర్ జిల్లా గుమ్మడానికి చెందిన రైతు కృష్ణారెడ్డి (99890 40309) బత్తాయి చెట్ల మొదళ్లకు ఆవుపేడ, మట్టి పూసి చక్కని ఫలితం పొందుతున్నారు. పిచికారీ తీరును చూసి విస్తుపోయా! బత్తాయి తోటల సమస్యలపై గత కొన్నేళ్లుగా నల్లగొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. అందులో భాగంగా క్షేత్ర పరిశీలన చేసినప్పుడు.. గ్లైఫోసేట్ మందును రైతులు పిచికారీ చేస్తున్న అపసవ్య పద్ధతులను చూసి విస్తుపోయా. కొన్నిచోట్ల 2, 4-డి మందును కూడా దీంట్లో కలిపి చల్లడం నన్ను హతాశుడ్ని చేసింది. కొందరు రైతులకు నచ్చజెప్పి ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయించా. ‘జీవామృతం’ ఊహించని ఫలితాలనిస్తోంది. ‘మల్చింగ్’ సంగతి సరేసరి. కలుపు మందులు వాడే రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. - డాక్టర్ గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి (99082 24649), ప్లాంట్ పాథాలజిస్ట్, ఐఐఐటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ ప్రకృతి సేద్యంలో సమస్యలపై 25న నెల్లూరులో చర్చాగోష్టి! తెలుగు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆచరణలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నెల్లూరులో ఈ నెల 25న చర్చాగోష్టి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గోఆధారిత వ్యవసాయదారుల సంఘం తొలిసారి ఈ చర్చాగోష్టిని నిర్వహిస్తోంది. నెల్లూరులోని టీటీడీ కల్యాణమండపం ఎదురుగా గల సాయి కంటి ఆసుపత్రి ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పాల్గొనదలచిన రైతులు ఈనెల 24వ తేదీలోగా తప్పకుండా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని నిర్వాహకులు పి.రామ్మోహన్ (98667 60498), కుమారస్వామి(94401 27151) విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయదలచిన రైతులకు 25 నాటి సమావేశంలోకి ప్రవేశం లేదని వారు స్పష్టం చేశారు. కొత్త రైతుల కోసం ఆ మర్నాడు(26న) టీటీడీ కల్యాణమండపంలో శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. -
ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయాధికారులకు ఉద్యోగోన్నతులు
ఖమ్మం వ్యవసాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఇక్కడి వ్యవసాయ శాఖాధికారులకు ఉద్యోగోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సుందర్ రెడ్డి అన్నారు. సంఘం ఖమ్మం యూనిట్ వార్షిక సమావేశం జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం లోని 15మంది వ్యవసాయాధికారులకు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకుల స్థాయి పోస్టులు, 30మంది వ్యవసాయాధికారులకు ఉప సంచాలకుల స్థాయి పోస్టులు వచ్చే అవకాశముందని అన్నారు. వ్యవసాయాధికారుల వేతనాలు, ఇతర ప్రయోజనాలపై పే రివిజన్ కమిటీకి రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం సమగ్ర నివేదిక ఇచ్చిందన్నారు. వ్యవసాయాధికారుల సర్వీస్ సంబంధ సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. సహాయ వ్యవసాయ సంచాలకుల పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. దీని ద్వారా ఉద్యోగాలలో సమతుల్యం పాటించే అవకాశముందన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పరిశీలించిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో మొట్టమొదటి రికగ్నైజ్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘంగా ఆవిర్భవించింది తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘమేనని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా; వ్యవసాయాధికారుల సంఘం జిల్లా ఫౌండర్ చైర్మన్, విశ్రాంత జేడీఏ చంద్రమోహన్, వ్యవసాయాధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాంరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సుధాకర్‌రావు, కోశాధికారి అరుణ జ్యోతి, సహాయ వ్యవసాయ సంచాలకులు మణిమాల, అంజమ్మ, వాణి, స్వరూపరాణి, సరిత, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.