breaking news
sholay completes 40 years
-
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్‌ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
అప్పుడే 40 ఏళ్లా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) అప్పటి వరకు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పుస్తకాల్లోని జానపద కథలు మాత్రమే తెలుసు... భేతాళుడి కథల్లో విక్రమార్కుడు చివర్లో చిక్కుముడి ఎలా విప్పుతాడో అనే ఆసక్తి మాత్రమే అందమైన అనుభూతి. అప్పుడప్పుడు ఆ పుస్తకాల్లోని నీతి కథలు మాత్రమే పరిచయం... ఒకటి రెండు సినిమాలు చూసినా అంతగా ప్రభావితం చెయలేదు. తొమ్మిదేళ్ల వయసులో ఏం గుర్తుంటాయి.. సినిమాలు తెలియవు.. ఫైట్లు అంతకన్నా తెలియవు. పాటలు తెలియవు... పాడటం అసలు రాదు..అలాంటి రోజుల్లో ఒక రోజు స్కూల్లో పక్కబెంచి క్లాస్ మేట్ నోట '' అరె ఓ సాంబా''.. ఏంటది వింతగా ఉంది.. తిట్టా, పొగడ్తా, కొత్త పలకరింతా.. 40 ఏళ్ల క్రితం మొదటిసారి విన్న కొత్త పదం... నాలుగు దశాబ్దాలుగా టీవీలో ఎప్పుడు వినిపించినా, కనిపించినా అతుక్కుపోయేంత దగ్గరితనం. అప్పుడు, ఇప్పుడు కూడా సినిమాలంటే పెద్ద ఆసక్తి లేదు. మూడు గంటలు అలా కళ్లప్పగించి చీకటి గదిలో బందీ కావడం ఎందుకో నచ్చదు. కానీ సాంబాకు మాత్రం ఆ మినహాయింపు..ఎందుకు? ఇద్దరు హీరోలు, ఒక ఊరి పెద్ద, ఒక విలన్.. కొన్ని ఫైట్లు, కొంత మెలోడ్రామా... కొంత హాస్యం.. కొంత సరదా.. మంచి స్నేహం.. విషాదం.. ఆహ్లాదం.. మూడు గంటలపాటు 'రామ్ గఢ్' కొండల్లో క్షణక్షణానికి ఎగిసే జ్వాల (షోలే అర్థం అదే కదా!) సినిమాలు అంటే ఒక సాఫ్ట్ హీరో, కన్నీళ్లు పెట్టే హీరోయిన్, నాలుగు పాటలు.. చివరికి శుభం కార్డ్... ఈ మూస ధోరణి నుంచి భారతదేశ సినిమాను ఒక కొత్త ప్లాట్ ఫాం మీద నిలబెట్టింది షోలే. హీరోలంటే సాఫ్ట్ గానే ఉండాలనే మూస ధోరణికి గుడ్ బై చెప్పి కథా నాయకుడికి కొత్త గెటప్ ఇచ్చింది. స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా గబ్బర్ సింగ్ ప్రత్యక్షమవ్వాల్సిందే.. 'అబ్ గోలీ ఖావో' డైలాగ్ వినపడాల్సిందే. స్నేహానికి నిర్వచనం ... ఇంటికి వెళుతూ దోస్త్ భూజాల మీద చేతులు వేసి ' ఏ దోస్తీ హమ్ నహీ ఛోడేంగే' అంటూ నడిచిన కిలోమీటర్లు ఎన్నో.. మొన్నీ మధ్య చిన్నప్పటి దోస్తు ల డిన్నర్ పార్టీలో మళ్లీ పాడుకున్నాం... అప్పుడే 40 సంవత్సాలు అయిందన్న విషయం తెలియకుండానే..! 'ఏ హాథ్ నహీ.. ఫాంసీ కా ఫందా' అని ఠాకూర్ సాబ్ గర్జించిన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మొదటిసారి చూసినపుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి... ఇప్పటికీ అదే ఫీలింగ్.. క్లైమాక్స్ లో గబ్బర్ సింగ్ మొహంపై నాడాలు ఉన్న షూతో ఠాకూర్ సాబ్ తొక్కుతున్న సీన్ లో థియేటర్లో మోగిన చప్పట్లు వినపడుతూనే ఉన్నాయి. పట్టుదల, ప్రతీకారం నేర్పింది కూడా షోలేనేమో. గలగల పారే సెలయేరు ఒకటి మౌనముద్ర వహిస్తే 'ఛోటీ బహూ' మాటల కన్నా ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షల్ని ఎలా కట్టిపడే యొచ్చో కూడా మొదటిసారి తెలిసింది ఆ మూడు గంటల్లోనే.. ఎన్ని ఇబ్బందులున్నా జీవితాన్ని సరదాగా ఎలా లాగేయొచ్చో నవ్వులు పంచుతూ ఆవిష్కరించిన వీరూ.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అపుడపుడు సెటైర్లతో 'తుమ్ హారా నామ్ క్యాహై బసంతీ' అని అమాయకంగా ప్రశ్నించే జయ్... స్నేహితున్ని కాపాడేందుకు ' బొమ్మా, బొరుసా'లో బొమ్మ మాత్రమే చూపించి ప్రాణాలర్పించిన అదే జయ్... ' హమ్ గావ్ వాలే' అంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించిన బసంతీ.. 'చల్ ధన్నూ' అంటూ టాంగాతో పాటు మనల్ని దోచుకున్న దృశ్యం ... 'మహబూబా' పాటతో ఐటమ్ సాంగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన హెలన్ 'ఆప్ కా నమక్ ఖాయా సర్దార్' అంటూ అమాయకంగా 'గోలీ' తిన్న కాలియా.. హమ్ అంగ్రేజ్ కే జమానే కా జైలర్ హై అంటూ డాంబికాలు పోయే జైలర్.. ఎన్నెన్ని పాత్రలు..ఎన్ని రంగుల కలబోత, ఎన్ని భావాల అల్లిక... గబ్బర్ సింగ్.. విలనీని కొత్త పుంతలు తొక్కించిన ఆ కరకు బూట్ల చప్పుడు.. ఎంతో నిదానంగా పొగాకు అరచేతిలో నలిపి నోట్లో వేసుకుని, అంతే నిదానంగా తుపాకి గురిపెట్టి ప్రాణాల్ని నలిపేసిన కర్కశత్వం.. థియేటర్ గోడలు ప్రతిధ్వనించే నవ్వు.. ఇంటికి వెళ్లాక కూడా అలా వెంటాడి వేటాడే చూపు... దేశంలో ఏ జైలుకు కూడా తనని 20 సంవత్సరాలు బంధించే సత్తా లేదనే అతిశయం.... పగ, ప్రతీకారం... చట్టాన్ని కాపాడిన వ్యక్తి... అదే చట్టాన్ని కాదని వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని.. డాకూని దొంగలతోనే పట్టుకోవాలనే ప్రయత్నం.. నడకలో, ఎక్స్ ప్రెషన్స్ లో ఠీవీ.. ఠాకూర్ అంటే ఇలాగే ఉంటారేమో అన్నంత పరిచయం... సలీం జావెద్ లు చిన్నగా అల్లుకున్న కథ భారతదేశ చలనచిత్ర చరిత్రలో వట వృక్షం అంత ఎదిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు 'షోలే' ఛాయలు కనిపించని సినిమాలు చాలా అరుదు. ఎక్కడో ఒక చోట ఒక పోలిక..ఎక్కడో కాపీ కొట్టిన ఛాయలు.. ఇప్పటితరం ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేయగలిగిన సమకాలీనత. నటీనటుల పేర్లు అప్రస్తుతం.. 1975 ఆగస్టు 15న విడుదలైన తర్వాత నటీనటులు వారి పేర్లు వారే మరచిపోయేంతటి ప్రభావం వేసిన దృశ్యకావ్యం.. బహుశా ఇలాంటి అభిప్రాయమే నా తరంలో మెజారిటీ ప్రేక్షకులకి కలిగి ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకి కూడా.. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల మంది షోలేను చూసి ఉంటారని ఒక అంచనా. రైల్వే స్టేషన్ లో మొదలైన సినిమా అదే రైల్వేస్టేషన్ లో ముగుస్తుంది... ఈ మధ్యలో మరచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి... భారతదేశ సినిమా షోలేకు ముందు.. షోలే తర్వాత... నాకుమాత్రం సినిమా అంటే షోలే మాత్రమే... -ఎస్. గోపినాథ్ రెడ్డి