breaking news
sarojinidevi eye hospital
-
కోలుకుంటున్న స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ బుధవారం చెప్పారు. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న ఘటనలో ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. సరోజినీదేవి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా, మెరుగ్గా ఉందని తెలిపారు. గురువారం ఉదయం మరోసారి పరీక్షించిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. -
‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం వెళ్లి పాక్షికంగా చూపు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. వారికి అన్ని రకాలుగా చికిత్స అందిస్తున్నామని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ఆపరేషన్‌కు వినియోగించిన కలుషిత రింగర్ లాక్టేట్ ద్రావకం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, అందుకే 8 మంది పాక్షికంగా కంటిచూపు కోల్పోయారని తెలిపారు. ఇందుకు కారణమైన నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని మంత్రి తెలిపారు. -
సరోజినీదేవి ఆస్పత్రిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సీఎస్, డీజీపీలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని కేసు న మోదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే 15 రోజుల విరామం తర్వాత శుక్రవారం ముగ్గురు బాధితులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు. మరో నలుగురిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్, లోకాయుక్త విచారణకు ఆదేశించగా, ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి, ఉన్నత స్థాయి నిపుణుల బృందం విచారిస్తుంది. అయితే ఇన్ఫెక్షన్కు సెలైన్ బాటిల్లో ఉన్న బ్యాక్టీరియానే కారణమని ఇప్పటికే ఆస్పత్రి వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఫ్యూమిగేషన్ను చేపట్టి ఎలాంటి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే థియేటర్లను తెరిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
‘సరోజినీ’ బాధితులు డిశ్చార్జి
హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలతో చూపు కోల్పోయిన పేషెంట్లను మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇక చూపు రాదని నిర్ధారించుకున్న రోగులు... ఇంటికి పోతామని చెప్పడంతో ఆస్పత్రి వైద్యులు వారిని ఇంటికి పంపించారు. డిశ్చార్జి అయినవారిలో నూకాలతల్లి, అర్పనీబాయి, ప్రభావతి, అంజిరెడ్డి ఉన్నారు. దీంతో ఒక్కరు మినహా అంతా డిశ్చార్జి అయ్యారు. మాణిక్యం చికిత్స పొందుతున్నారు. నూకాలతల్లిని రెండు రోజులకోమారు వైద్య పరీక్షల కోసం రావాలని సూచించారు. ఆమెకు త్వరలో మరో ఆపరేషన్ చేసి చూపు తెప్పించే అవకాశం ఉందన్నారు. అంజిరెడ్డి, అర్పనీబాయి, ప్రభావతిలకు కూడా చూపు రప్పించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజేశ్ గుప్తా తెలిపారు. గత నెల 30న కంటి సమస్యల తో బాధపడుతున్న 21 మందికి సరోజినీదేవి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్సలు వికటించి వీరిలో 12 మంది చూపు కోల్పోయారు. ఇద్దరికి నేత్రదానం ద్వారా వైద్యులు చూపు తెప్పించారు. ఇంకా కళ్లు కనపడడం లేదు: నూకాలతల్లి ఎన్ని ఆపరేషన్లు చేసినా కళ్లు మాత్రం కనబడడం లేదు. ఆస్పత్రిలో ఉండలేకపోతున్నాం. కళ్లు వస్తాయనే నమ్మకం లేక బేజారై ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంటి వద్ద అన్నం పెట్టే వారు కూడా లేరు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఏ పనీ చేసుకోలేని దుస్థితి: అంజిరెడ్డి ఉచితంగా కంటి చూపు మెరుగు చేస్తారని ఆస్ప త్రికి వస్తే ఉన్న చూపు కాస్తా పోయింది. 2 వారాలు న్నా కళ్లు కనిపించడం లేదు. దీంతో నడవడం కూడా కష్టమవుతోంది. ఇంటికెలా వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు. వెళ్లినా ఏ పనీ చేసుకోలేని దుస్థితి. -
‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్
కేసును సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్ సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ), లోకాయుక్త సీరియస్‌గా స్పందించాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం శుక్రవారం సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం శనివారం ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించనుంది. బాధితులకు చికిత్సలు.. కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి కార్నియాను సేకరించి బాధితుల్లో ఒకరైన నూకాలమ్మతల్లికి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా తెలిపారు. ఇక సరోజినీ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేయడంతో శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ థియేటర్లను తిరిగి తెరిచేదాకా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్సలు చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను కూడా ఉస్మానియా, గాంధీలకు తరలించి, శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ ఫిర్యాదు..: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో-కన్వీనర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైదరాబాద్‌లోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి ‘‘రాష్ట్ర ప్రభుత్వం రోగుల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదు. నాసిరకం మందులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఎంతో పేరుపొందిన సరోజిని ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. సర్జరీలకు ముందే ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసుకోవాలన్న కనీస సూత్రాన్ని వైద్యులు పాటించలేదు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’’. - చెరుకు సుధాకర్,తెలంగాణ ఉద్యవు వేదిక చైర్మన్ వైద్యులపై కేసులు నమోదు చేయొద్దు: టీజీడీఏ నాసిరకం మందులు తయారు చేసిన కంపెనీలను, కొనుగోలు చేసి సరఫరా చేసిన టీఎస్ఎంఐడీసీ అధికారులను వదిలేసి రోగులకు చికిత్స చేసే వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం దుర్మార్గమని తెలంగాణ వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. వైద్యులపై కేసులు నమోదు చేయాలని చూస్తే ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
ఉన్నచూపూ పోయింది
► ఆపరేషన్ తర్వాత కంటిచూపు కోల్పోయిన ఏడుగురు.. సరోజినీదేవి ఆసుపత్రిలో దారుణం ► సర్జరీ అనంతరం వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానే కారణం! ► ప్రాథమికంగా తేల్చిన వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ ► ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ► బ్యాక్టీరియా ఉన్న 13.07 లక్షల బాటిళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా ► సెలైన్ బాటిళ్లు సరఫరా చేసింది నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ► కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రభుత్వం ► బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి ► వైద్యులపై హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యమో... సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానో... కారణం ఏదైతేనేం.. ఏడుగురి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి! కంటిచూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్తే ఉన్న చూపూ పోయింది! కంటి శుక్లాలకు చేసే క్యాటరాక్ట్ ఆపరేషన్‌తో ఆ అభాగ్యులు వెలుగులకు దూరమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. శస్త్రచికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియా వల్లే కంటి చూపు పోయిందని వైద్యఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ బాటిళ్లు ఇంకా ఎక్కడెక్కడికి సరఫరా అయ్యాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలా జరిగింది..? చూపు మందగించడంతో బాధితులు జూన్ 28న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. 30న రెండు ఆపరేషన్ థియేటర్లలో మొత్తం 21 మందికి ఆపరేషన్ చేశారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో తొమ్మిది మందికి, రెండో ఆపరేషన్ థియేటర్లో 12 మందికి సర్జరీ చేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ కవిత, డాక్టర్ కిషోర్ల వైద్య బృందం రెండో థియేటర్లో సత్యనారాయణ(60), పీసీ మండల్(67), అంజిరెడ్డి(70), నూకాలమ్మతల్లి(60), మాణిక్యం(75), ప్రభావతి(65), అర్పిణిబాయి(65), కృష్ణయ్య(60), సరళారాణి(76), బీములు(60) నాగలక్ష్మి(65), దోబ్రూ(60)లకు క్యాటరాక్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ చేసిన రెండ్రోజుల తర్వాత బాధితుల కంటికి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కన్నువాచిపోయి భరించలేని నొప్పితోపాటు కంటి నుంచి రక్తం కారింది. దీంతో వైద్యులు వారిని మరోసారి పరీక్షించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ గదుల్లోని పరికరాలను, వాడిన మందులను పరిశీలించారు. రెండో ఆపరేషన్ గదిలో కంటిని శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్‌ను పరీక్షించగా అందులో ‘క్లెప్సెల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని వైద్యులు వివరిస్తూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమణికి బుధవారం లేఖ రాయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో సత్యనారాయణ, పీసీ మండల్, అంజిరెడ్డి, నూకాలమ్మతల్లి ఎడమ కన్ను, మాణిక్యం, ప్రభావతి, అర్పిణిబాయిల కుడి కన్ను చూపును కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరికి కార్నియా మార్పిడి(ఆప్టికల్ కెరిటోప్లాస్ట్) చేసి చూపును ప్రసాదించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన ఐదుగురు మాత్రం శాశ్వతంగా చూపుకు దూరం కానున్నారు. ఇదే ఆపరేషన్ గదిలో సర్జరీ చేయించుకున్న మిగతా ఐదుగురికి కూడా ఇన్ఫెక్షన్ సోకినా వారికి కంటిచూపు పోలేదని వైద్యులు చెబుతున్నారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకున్న తొమ్మిది మంది కంటి చూపు బాగానే ఉంది. ఈ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూడడంతో జూలై ఒకటో తేదీ నుంచి ఆస్పత్రిలో క్యాటారాక్ట్ సర్జరీలు నిలిపివేశారు. పూర్తిస్థాయి విచారణకు కమిటీ ఎంతో పేరున్న సరోజినీదేవి ఆసుపత్రిలో ఈ ఘటన జరగడంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. బాధితులకు నష్టపరిహారం అందించాల్సిందిగా డీఎంఈ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన వెంకటేశ్వర్లతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని కూడా విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ బాటిళ్లను కంపెనీ నుంచి కొని ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పాత్రపైనా సర్కారు విచారణ చేస్తోంది. ఇక సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందని డీఎంఈ ప్రభుత్వానికి నివేదించగా.. అందులో ఎలాంటి బ్యాక్టీరియా లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ మరో నివేదిక ఇచ్చారు. ఎక్కడివి ఆ బాటిళ్లు.. ఎన్ని కొన్నారు? రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. టెండర్లు పిలిచి వివిధ కంపెనీల నుంచి మందులు, పరికరాలను కొనుగోలు చేస్తుంది. గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా చేసే బాధ్యతను నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. ఈ సెలైన్‌ను రింగర్ లాక్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేయాల్సిందిగా టీఎస్ఎంఎస్ఐడీసీ గతేడాది డిసెంబర్ 31న ఆ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1,200 సెలైన్ బాటిళ్లు సరోజినీదేవి ఆసుపత్రికి అందజేశారు. వాటిల్లో 16,385 బ్యాచ్‌కు చెందినవి 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్వి 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆసుపత్రికి అందాయి. రెండో థియేటర్లో ఉపయోగించిన ఏడు బాటిళ్లలోని సెలైన్ నమూనాలను పరీక్షకు పంపించారు. వీటిలో రెండింటిలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. ఆసుపత్రికి వచ్చిన 1,200 బాటిళ్లలో ఇప్పటివరకు 624 బాటిళ్లను ఉపయోగించారని తేలింది. ఇంకా 576 బాటిళ్లు ఆసుపత్రిలోనే ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. 624 బాటిళ్లను పలువురికి ఉపయోగించినందున వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ కంపెనీ నుంచి వచ్చినవి 13.07 లక్షల బాటిళ్లు నాగ్‌పూర్‌కు చెందిన కంపెనీ నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు విడతలుగా 13.07 లక్షల సెలైన్ బాటిళ్లను సరఫరా చేసింది. మొదటి విడత 7.95 లక్షల బాటిళ్లు, రెండో విడత 5.11 లక్షల బాటిళ్లు సరఫరా చేసింది. మొత్తం 128 బ్యాచ్‌లుగా అవి రాష్ట్రానికి చేరాయి. అయితే వాటిని రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు తరలించారు? వాటిలో ఎన్ని వాడారన్న సమాచారం తెలియాల్సి ఉంది. సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టినందున ఆసుపత్రులకు చేరిన లక్షలాది సెలైన్ బాటిళ్లను ప్రభుత్వం సీజ్ చేయాలని నిర్ణయించింది. వాటిని వాడొద్దని ఆదేశాలిచ్చినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు తమ కంటిచూపు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. జూనియర్ వైద్యులతో శస్త్రచికిత్స చేయిం చినట్లు వెల్లడించారు. ఇందుకు కారణమైన బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యులపై ఐపీసీ 338 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు సరోజినీదేవి ఆస్పత్రికి వెళ్లి సెలైన్ బాటిళ్లు, వాటిని నిల్వ చేసిన తీరు, ఎక్స్పైరీ డేట్ వంటి అంశాలపై ఆరా తీశారు. ఆ కాస్తా చూపు పోగొట్టారు వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే కంటి అద్దాలు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను. రెండు, మూడు సార్లు ఆపరేషన్ చేశారు. కట్లు విప్పాక ఏమీ కన్పించలేదు. వైద్యులు నాకు సర్జరీ చేసి ఉన్న ఆ కొద్దిపాటి చూపు కూడా పోగొట్టారు. - ప్రభావతి, జీడిమెట్ల, హైదరాబాద్ బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సరోజినీదేవి ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు వికటించడంపై ఆరా తీశారు. ‘‘సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఘటనకు బాధ్యులైన వారిపై, సంస్థలపై క్రిమినల్ కేసులు పెడతాం. మొత్తం 13 మందికి ఆపరేషన్ చేయగా.. వారిలో ఆరుగురు మంచి చూపుతో ఇంటికెళ్లారు. ఐదుగురికే ఒక కన్ను మాత్రమే పోయింది. మరో ఇద్దరు ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. ఒక కన్ను పోయిన ఐదుగురికి కూడా పూర్తిగా ఒక కన్ను పోయిందని చెప్పలేం. వారికి ప్రభుత్వ పరంగా బయటి డాక్టర్లను తెప్పించి లేదా వేరేచోట వైద్యం చేయిస్తాం. రెండో థియేటర్లోని సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలింది. మరో థియేటర్లో ఎలాంటి బ్యాక్టీరియా బయటపడలేదు. వాడిన ఏడు బాటిళ్లను పరీక్షలకు పంపగా... రెండింటిలో బ్యాక్టీరియా బయటపడింది’’ అని చెప్పారు. నగరంలో 30 ఆసుపత్రులకు 30 వేల బాటిళ్లు.. హైదరాబాద్‌లో మొత్తం 30 ఆసుపత్రులకు ఇలాంటివే 30,840 సెలైన్ బాటిళ్లను సరఫరా చేశారు. ఈ బ్యాచ్‌లకు చెందిన బాటిళ్లలోనే బ్యాక్టీరియా బయటపడింది. వాటిల్లో ఇప్పటివరకు ఎన్నింటిని వాడారన్నది తేలా ల్సి ఉంది. నగరంలో బార్కాస్ సామాజిక ఆరోగ్య కేంద్రం, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ సాధారణ చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, అంబర్‌పేట, లాలాపేట, పానీపుర, సీతాఫల్మండి, అడ్డగుట్ట, బైబిల్ హౌస్, బోరబండ, డీఆర్ పాల్ దాస్, గడ్డి అన్నారం, గరీబ్‌నగర్, కిషన్‌బాగ్, తార్నాక, పాన్ బజార్, పురాన్‌పూల్-1, ఆర్ఎఫ్పీటీసీ, తుకారాంగేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మలక్‌పేట, మల్లేపల్లి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో, నయాపూల్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రుల్లో, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, శాలిబండ మున్సిపల్ సామాజిక ఆసుపత్రిలో ఈ బాటిళ్లను సరఫరా చేశారు. కన్ను తెరిచి చూస్తే ఏమీ కన్పించలేదు కంటిచూపు మందగించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చా. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఏమీ కనపడ లేదు. కంటి చూపు పూర్తిగా పోయింది. పెద్ద ఆసుపత్రని వస్తే నన్ను గుడ్డిదాన్ని చేశారు. - నూకాలమ్మతల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం. రెండుసార్లు ఆపరేషన్ చేశారు అక్షరాలు సరిగా కన్పించక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని వచ్చా. ఆపరేషన్ చేశారు. రెండ్రోజుల తర్వాత మళ్ల్లీ రమ్మాన్నారు. చెకప్‌కు వెళ్తే మరోసారి ఆపరేషన్ చేశారు. - అర్పిణిబాయి, గోల్కొండ , హైదరాబాద్ ఇంత దూరం వచ్చి తప్పు చేశా.. మా ఊళ్లో డాక్టర్లు చెబితే ఇక్కడికి వచ్చాను. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే సరే అన్నాను. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని గుడ్డివాణ్ణి అయ్యాను. - మాణిక్యం, కుకునూరు, మెదక్ ఇలా అవుతుందని అనుకోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఉన్న కంటిచూపు పోయింది. ఈ వయసులో గుడ్డివాడిగా ఎలా జీవిం చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. - అంజిరెడ్డి, పలుగుట్ట, చేవేళ్ల కళ్లు తెరిస్తే అంతా చీకటే నా కూతురు సలహా మేరకు కంటి పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. వారం తర్వాత కళ్లు తెరిస్తే అంతా చీకటే. ఉన్న చూపు పోయింది. - పి.సి.మండల్, కోల్‌కతా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా కంటిచూపు పోయింది. నాకు డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేశారు. చివరికి నన్ను ఇలా గుడ్డివాణ్ణిలా తయారు చేశారు. - సత్యనారాయణ, కార్వాన్, హైదరాబాద్ -
‘సరోజినీదేవి’కి నీటి సరఫరా పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: సరోజినీదేవి కంటి ఆసుపత్రికి జలమండలి అధికారులు శనివారం నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వద్ద వాల్వ్‌ను మార్చడంతో ఆసుపత్రికి సరఫరా అయ్యే నీటి నాణ్యత, రంగు మెరుగుపడ్డాయన్నారు. నీటి నాణ్యత పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కంటి ఆసుపత్రిని శని వారం ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ డెరైక్టర్ ఆపరేషన్ రామేశ్వర్రావు, గోషామహల్ సర్కిల్ -3 చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, జలమండలి జనరల్ మేనేజర్ స్వామి, క్వాలిటీ అక్యూరెన్స్ టెస్టింగ్ జీఎం తన్నీరుజవహార్ ఆసుపత్రిని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని నీటిసంపులను, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశీ లించగా నాచు పేరుకొని పోయి అపరిశుభ్రంగా కనిపించాయి. ఈ కారణంగానే ఆసుపత్రిలో మురుగు నీటి సమస్య తలెత్తిందని తేల్చారు. -
సరోజినీదేవి ఆస్పత్రి ఉద్యోగుల ధర్నా
మెహిదీపట్నం (హైదరాబాద్): రెండు నెలలుగా జీతాలు సరిగా ఇవ్వక పోవడంతో సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కాంట్రాక్టు సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బంది ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు కూర్చుని తమ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు నెలల నుంచి జీతాలు అందక పోవడంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే మరింతగా ఉద్యమిస్తామన్నారు. కాగా, రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.కె.వినోద్‌కుమార్ తెలిపారు.